Breaking News

తెలంగాణలో రికవరీ రేటు 72శాతం


తెలంగాణలో గడిచిన 24గంటల్లో 13,787 శాంపిల్స్‌ పరిశీలించగా.. కొత్తగా 1286 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 68,946కు చేరింది. కాగా కరోనా నుంచి కొత్తగా 1066 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 49,675గా ఉంది. గత 24 గంటల్లో 12 మంది కరోనాతో మృతి చెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 563కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,708 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.జీహెచ్‌ఎంసీ పరిధిలో 391, రంగారెడ్డిలో 121 కరీంనగర్‌లో 101, మేడ్చల్‌లో 72 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా రికవరీ రేటులో జాతీయ స్థాయి(65శాతం)తో పోలిస్తే తెలంగాణలో 72శాతంతో మెరుగ్గా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో 84 శాతం హోంఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటుండగా.. 11,935 మంది వివిద ఐసోలేషన్ కేంద్రాలు‌, ఆసుపత్రుల్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.