Breaking News

సిరిసిల్లలో కేటీఆర్‌ సుడిగాలి పర్యటన


టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు ప్లాస్మా దానం చేయడానికి‌ ముందుకు రావాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.‌ తాను సైతం ప్లాస్మా డోనేషన్ చేస్తానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసిన మంత్రి కేటీఆర్, సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో కోవిడ్ వార్డును, ఐదు ప్రత్యేక అంబులెన్స్‌లను ప్రారంభించారు. పంచాయతీ రాజ్ శాఖ ఈఈ, డీఈఈ భవనాలకు శంఖుస్థాపన చేశారు.‌ అనంతరం సర్దాపూర్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఐసోలేషన్ వార్డును ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా టెస్టులు పెంచుతామని.. పాజిటివ్ వస్తే భయాందోళనకు గురై ఆగమాగం కావద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99 శాతం ఉందని.. ఇది 100 శాతం ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. మంత్రులుగా ఉన్న వాళ్లు ప్రజల్లో తిరగాలని.. జనాలకు అవగాహన కల్పించే బాధ్యత తమపైనే ఉందన్నారు. కొందరు చిల్లరమల్లరగా మాట్లాడుతూ రాజకీయం చేయడం మంచిది కాదని కేటీఆర్‌ హితవు పలికారు.