Breaking News

భారీ వర్షాలకు నాగార్జున సాగర్‌కు భారీ వరద.. 18 గేట్ల ఎత్తివేత


గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో భారీగా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులకు మరోసారి భారీగా వరద నీరు చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు 18 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3,10,631 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 309.6546 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను... ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరింది.
మరోవైపు పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 6 గేట్లు 4 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 43.304 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 173.390 అడుగులుగా నమోదు అయ్యింది. అటు మూసీ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు చేరింది. మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు 2 గేట్ల నుంచి నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగులు(4.46టీఎంసీలు) కాగా... ప్రస్తుత నీటి మట్టం 644 అడుగుల(4.20టీఎంసీలు)కు చేరింది.