Breaking News

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఈ నెల 19న ప్రారంభించనున్న కేటీఆర్.. డేట్ ఫిక్స్


హైదరాబాద్‌ జాబితాలో మరో పేరున్న కట్టడం వచ్చి చేరింది. దుర్గం చెరువుపై కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో దాని ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వాహనాల రాకపోకలకు వీలుగా అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జిని ఈ నెల 19న ప్రారంభించేందుకు హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి కేటీఆర్ ఈ వంతెనను లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఐటీ ఉద్యోగులకే కాకుండా నగర ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యంగా ఉండేలా దూరాన్ని తగ్గించేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు కూడా ఈ వంతెన వల్ల తీరనున్నాయి. అంతేకాక, దుర్గం చెరువు ప్రాంతం పర్యటక పరంగానూ ఎంతో అభివృద్ధి చెందనుంది. మొత్తం రూ.184 కోట్లతో ఈ తీగల వంతెనను నిర్మించారు. ఇందుకు మొత్తం రెండేళ్ళ సమయం పట్టింది. నిర్మాణ బాధ్యతలను ఎల్ అండ్ టీకి అప్పగించారు. కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టగా.. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జి ఇదే కావడం విశేషం.

ఈ మార్గంలో..
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45ను మాదాపూర్‌తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు. రెండు పిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు. జర్మన్ టెక్నాలజీతో 8 దేశాల ఇంజినీర్లు 22 నెలలపాటు శ్రమించి దీని నిర్మాణాన్ని పూర్తి చేశారు. దుర్గం చెరువు నీటి మట్టానికి 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మితమైంది. ఒక్కో పైలాన్‌కు 26 ద్రుఢమైన ఐరన్ కేబుళ్లను వాడారు.