Breaking News

ఏపీలో కరోనా: 7లక్షలకు కేసులు, 5,828 మరణాలుకొవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో భారీగా చేపడుతోన్నటెస్టులకు అనుగుణంగా కొత్త కేసులూ అదే స్థాయిలో వస్తున్నాయి. అయితే, గడిచిన నెల రోజులతో పోల్చుకుంటే, ఈ వారం కొత్తగా ఇన్ఫెక్షన్ కు గురవుతోన్న వారి సంఖ్య తగ్గుముఖంపట్టింది. అదే సమయంలో డిశ్చార్జీల సంఖ్య భారీగా పెరిగింది. మరణాలు సైతం కంట్రోల్ లోకి వస్తుండటం శుభపరిణామం.
రాష్ట్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 7లక్షలకు చేరువగా, 6,93,484కు పెరిగింది. అన్ని జిల్లాల్లో కలిపి కరోనా కాటుకు బలైపోయినవారి సంఖ్య 5,828కి చేరింది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎనిమిది మంది, ప్రకాశంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ఐదు, విశాఖపట్నం ఐదు, అనంతపురం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కడపలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 71,806 శాంపిళ్లను పరీక్షించారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 58.06లక్షలకు చేరింది. కొత్త కేసుల సంఖ్య తగ్గుతుండటంతోపాటు ఏపీలో డిశ్చార్జీల సంఖ్య పెరగడం గమనార్హం. ఇవాళ ఒక్కరోజే 7,075 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 6.93లక్షల కేసులకుగానూ ఇప్పటికే 6.29లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 58,445గా ఉంది.