Breaking News

ప్రైవేటు కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరిక......సిబ్బందిని తొలగిస్తే చర్యలు


SATYASHILA TV : కరోనా కాలంలో సాధ్యమైనంత వరకు సిబ్బందిని తగ్గించి ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి పలు కాలేజీలు ప్రయత్నిస్తున్నాయి. వారిని తొలగిస్తున్నామంటూ పలువురికి సమాచారం కూడా ఇస్తున్నాయి. దీంతో చాలామంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అయితే అలాంటి వారికి ఊరట కలిగించేలా తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు కాలేజీలు సిబ్బందిని తొలగిస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఎపిడెమిక్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు మేరకు సిబ్బంది లేకపోతే కాలేజీ గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని వెల్లడించింది. మరోవైపు కరోనా కారణంగా ఆలస్యమైన అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు నిన్న ప్రకటించింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కాలేజీల పనిదినాలు, ఏయే నెలలో ఏయే రోజుల్లో కాలేజీలను కొనసాగించే అంశాలతో షెడ్యూల్‌ జారీ చేసింది.సాధారణంగా 220 రోజులతో విద్యా సంవత్సరం ఉండనుండగా, ఈసారి 182 రోజుల పనిదినాలతో విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. దసరా, సంక్రాంతి వంటి పండుగ సెలవులు, ఇతరత్రా సెలవు దినాలను కుదించింది. మరోవైపు తాము ప్రవేశాల షెడ్యూల్‌ జారీ చేసిన తరువాతే కాలేజీలు ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం ఎలాంటి ప్రకటనలు జారీ చేయడానికి వీల్లేదని వెల్లడించింది. ఈ నిబంధనలను అతి క్రమించిన కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది.