Breaking News

భారత పార్లమెంట్ కి నూతన భావన నిర్మాణం : కాంట్రాక్ట్ దక్కించుకున్న టాటా సంస్థ


భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ కాంట్రాక్టు.. ప్రఖ్యాత టాటా సంస్థకు దక్కింది. కొత్త భవంతి నిర్మాణానికి సంబంధించి కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) బుధవారం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టు అసలు విలువ రూ.941 కోట్లుకాగా.. అందరికంటే తక్కువగా రూ.862కోట్లకు బిడ్ దాఖలు చేసిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (టీపీఎల్)కు కాంట్రాక్టు దక్కినట్లు ఆ శాఖ తెలిపింది.బిడ్ గెలుచుకున్న సంస్థ.. ఏడాదిలోగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించడంతోపాటు రాబోయే ఐదేళ్ల పాటు దానిని నిర్వహించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు తమకే దక్కడం గర్వకారణమని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి నుంచీ ఫ్రంట్ రన్నర్ గా ఉన్న లార్సెన్ అండ్ టబ్రో(ఎల్‌అండ్‌టీ) సంస్థ స్వల్ప తేడాతో ప్రాజెక్టును కోల్పోవడం గమనార్హం. రూ.865 కోట్లకు ఎల్‌అండ్‌టీ బిడ్ దాఖలు చేయగా.. అందుకు మూడు కోట్లు తక్కువగా (రూ.862కోట్ల) టాటా గ్రూప్ టెండర్ వేసింది.

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్-ఇండియా గేట్‌ను అనుసంధానం చేస్తూ నాలుగు కిలోమీటర్ల మేర విస్తీరించి ఉన్న సెంట్రల్ విస్థాను ఆధునిక హంగులతో పునర్నిర్మించేందుకు మోదీ సర్కార్ ప్రణాళికలు రూపొందించడం, అందులో భాగంగా కొత్త పార్లమెంట్ భవంతిని నిర్మించాలనుకోవడం తెలిసిందే. కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో బిడ్డింగ్ నిర్వహించగా.. టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (టీపీఎల్) కాంట్రాక్టును గెలుచుకుంది. కాగా..కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణ కాంట్రాక్టు బిడ్డింగ్ పూర్తయిన వేళ పార్లమెంటులో ప్రతిపక్షాలు మరోసారి నిరసనలు తెలిపాయి. కరోనా విపత్తు సమయంలో రూ.941 కోట్లు వెచ్చించి కొత్త భవనం కట్టాల్సిన అవసరం లేదని, ఆ నిధులను కొవిడ్ నిర్వహణకు వాడాలని కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలు వ్యాఖ్యలు చేశారు.