Breaking News

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..


ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు అంతా సిద్దమైంది. శనివారం డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, త్రీటైమ్ చాంప్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ ముందే అభిమానులకు, ఫ్రాంచైజీలకు శుభవార్త అందింది. యూకే నుంచి యూఏఈ వచ్చిన 21 మంది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు టోర్నీ ఫస్ట్ మ్యాచ్ నుంచే తమ జట్లకు అందుబాటులో ఉండనున్నారు. ఆ ఆటగాళ్ల క్వారంటైన్ సమయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తగ్గించింది. నిబంధనల ప్రకారం ప్రతీ ఒక్కరు కనీసం ఆరు రోజులు స్వీయనిర్బంధంలో ఉండాల్సి ఉండగా.. బీసీసీఐ తాజా నిర్ణయంతో 36 గంటలు మాత్రమే క్వారంటైన్‌లో ఉండనున్నారు. టీ20, వన్డే సిరీస్‌ కోసం తాము ఇప్పటికే బయో బబుల్‌లో ఉన్నాం కాబట్టి క్వారంటీన్‌ సమయాన్ని కనీసం మూడు రోజులకు తగ్గించాలంటూ ఆసీస్, ఇంగ్లండ్‌ క్రికెటర్లు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పుడు వారంతా 36 గంటలు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటే చాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్థానిక అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. 'క్రికెటర్ల ఐసోలేషన్‌ సమయానికి సంబంధించిన సమస్య పరిష్కారమైంది. వారంతా 6 రోజులు కాకుండా 36 గంటలు విడిగా తమ హోటల్‌ గదుల్లో గడిపితే చాలు. ప్రతీ జట్టు తొలి మ్యాచ్‌లోనే తమ స్టార్‌ ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఇది మంచి అవకాశం' అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూఏఈలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ప్రొటోకాల్‌ ప్రకారం వారికి వరుసగా కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో నుంచి పాల్గొంటున్న 21 మందిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ప్యాట్ కమిన్స్, ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటన్‌ (ముగ్గురూ కోల్‌కతా) మాత్రం ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఎందుకంటే కేకేఆర్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 23న ఉంది కనుక. ఈ ఆటగాళ్లంతా ప్రత్యేక విమానంలో గురువారమే దుబాయ్‌ చేరుకున్నారు. ఇక బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై ఆయా ఫ్రాంచైజీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.