Breaking News

షార్జా స్టేడియంలో సన్నాహాలపై సౌరవ్ గంగూలీ సమీక్ష


మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2020 ప్రారంభం కానుంది. టోర్నీలో పాల్గొనే 8 జట్లు గత నెలలోనే యూఏఈలో అడుగుపెట్టాయి. టోర్నీలో గర్జించేందుకు అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఐపీఎల్ సన్నాహాలను సమీక్షించేందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ గతవారం యూఏఈ చేరుకున్నాడు. మొత్తం మూడు వేదికలు దుబాయ్, అబుదాబి, షార్జాలలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ జరగనుంది.
తొలి మ్యాచ్ అబుదాబిలో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, గతేడాది రన్నర్స్ అప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. షార్జా స్టేడియం మొత్తం 12 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ నెల 22న ఇక్కడ తొలి మ్యాచ్ జరగనుంది. షార్జాలో చివరి లీగ్ మ్యాచ్ నవంబరు 3న సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.
ప్లేఆఫ్, ఫైనల్ మ్యాచ్‌లకు సంబంధించిన వేదికను ఖరారు చేయాల్సి ఉంది. ఐపీఎల్ సన్నాహాలను సమీక్షించేందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సోమవారం స్థానిక అధికారులు, ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా తదితరులతో షార్జా క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన గంగూలీ.. ''ఐపీఎల్ 2020కి షార్జా స్టేడియం సన్నద్ధమైంది'' అని పేర్కొన్నాడు.