Breaking News

చైనా దూకుడు నేపథ్యంలో బోఫోర్స్‌ శతఘ్నులను సిద్ధం చేస్తున్న ఆర్మీ


తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా ఘర్షణాత్మక వైఖరి నేపథ్యంలో భారత సైన్యం బోఫోర్స్‌ శతఘ్నులను అక్కడ మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు లద్దాఖ్‌లో 155ఎంఎం బోఫోర్స్‌ గన్స్‌కు ఆర్మీ ఇంజనీర్లు సర్వీసింగ్‌ చేస్తున్నారు. సర్వీసింగ్‌ పూర్తయ్యాక వాటిని సరిహద్దుల్లో మోహరిస్తారు. 1980ల్లో భారత అమ్ములపొదిలోకి చేరిన బోఫోర్స్‌ శతఘ్నులు.. కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. పర్వతాలపై పాక్‌ సైనికులు ఏర్పాటు చేసుకున్న బంకర్లను, వారు తలదాచుకున్న స్థావరాలను నేలమట్టం చేసి పాక్‌ ఆర్మీని కోలుకోలేని దెబ్బతీశాయి. మరోవైపు.. సరిహద్దు దేశాలతో ‘వోల్ఫ్‌ వారియర్‌ (దూకుడు వైఖరి)’ వ్యూహాన్ని అమలు చేస్తున్న చైనా.. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు సమీపంలో 270కి పైగా హెచ్‌-6 బాంబర్లను మోహరించినట్టు మిలటరీ వాచ్‌ మేగజైన్‌ ఒక కథనంలో పేర్కొంది.

చర్చలకు ముందు కాల్పులు..

భారత్‌, చైనా విదేశాంగ మంత్రులు కొద్దిరోజుల క్రితం మాస్కోలో భేటీ అయి చర్చించడానికి రెండు రోజుల ముందు.. లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర ఒడ్డు వద్ద 200 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆరోజు ఏం జరిగిందంటే.. భారత దళాలు ఫింగర్‌ 3 పశ్చిమ దిశగా ముందుకు కదలగా.. చైనీయులు ఫింగర్‌ 3, 4 నడుమ ఉన్న ప్రదేశాన్ని ఆక్రమించడానికి చొచ్చుకొచ్చారు. ఈ క్రమంలో రెండు దేశాల సైనికులూ ఒకరికొకరు 300 మీటర్ల సమీపానికి చేరుకున్నారు. ఆ సమయంలో.. ఇరుదేశాల సైనికులూ కలిపి గాల్లో 100- 200 రౌండ్ల దాకా కాల్పులు జరిపినట్టు భారత ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సెప్టెంబరు మొదటివారంలో పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో భారీగా(సైనికుల) కదలికలను గమనించినట్టు ఆ అధికారి తెలిపారు. సెప్టెంబరు 7న చుషుల్‌ సబ్‌సెక్టార్‌లో ఇరుదేశాల సైనికుల నడు మ కాల్పులు జరిగాయని, అయితే అవి హెచ్చరిక కోసం జరిపిన కాల్పులని.. సెప్టెంబరు 8న మా త్రం తీవ్రస్థాయిలోనే కాల్పులు జరిగాయన్నారు. అయితే, ఈ కాల్పులపై ఇరు దేశాలూ అధికారికంగా ఏ సమాచారాన్నీ వెల్లడించలేదు. మంత్రుల స్థాయిలో చర్చల నేపథ్యంలో ఇప్పుడక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ఓ అఽధికారి పేర్కొన్నారు.