Breaking News

ఔట‌ర్ రింగ్ రోడ్డుపై విరిగిపడ్డ కొండ చరియలు...


ఔట‌ర్ రింగ్ రోడ్డుపై రాజేంద్రన‌గ‌ర్ ఎగ్జిట్-16 స‌మీపంలో గురువారం మ‌ధ్యాహ్నం కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. స‌మాచారం అందుకున్న హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్, ఓఆర్ఆర్ అధికారులు అక్కడికి చేరుకుని ఓఆర్ఆర్‌పై వాహ‌నాల‌ను మ‌ళ్లించారు. కొండ‌చ‌రియ‌ల‌ను తొల‌గించేందుకు చ‌ర్యలు చేప‌ట్టారు.

హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించే సమయంలో కొన్ని చోట్ల పెద్ద కొండలను తొలిచి వాటి మధ్య నుంచి రహదారి వేశారు. దీంతో రోడ్డు పక్కనే కొన్ని చోట్ల ఎత్తైన కొండలు ఉన్నాయి. భారీ వర్షాలకు కొండ భాగం నానిపోయి రోడ్డుపై పడ్డట్లుగా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు.