Breaking News

భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌ ఇండియా లో నే .. గంగూలీ


దేశంలో కోవిడ్-19 పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తూనే, వచ్చే జనవరి-ఫిబ్రవరిలో భారత్- ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన సీరీస్‌ని స్వదేశంలోని నిర్వహించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఈ సిరీస్‌ను యూఏఈలో నిర్వహించే విధంగా అక్కడి బోర్డులో బీసీసీఐ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నప్పటికీ... మన దేశంలో నిర్వహించాలనేదే తమ ఆలోచన అని గంగూలీ చెప్పాడు. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 5 టెస్టులు, 3 వన్డేలు, 3 టి20లు జరగాల్సి ఉంది. భారత గడ్డపై దీనిని జరిపేందుకే మా తొలి ప్రాధాన్యత. అందుకోసం అన్ని ప్రయత్నాలూ చేస్తాం. యూఏఈ తరహాలో మన నగరాల్లోని మైదానాల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి బయో బబుల్‌ను ఏర్పాటు చేయవచ్చు. క్రికెట్‌ భారత్‌లో జరగాలని అంతా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడేమీ చెప్పలేం అని గంగూలీ పేర్కొన్నాడు.కోవిడ్ మహమ్మారి నేపధ్యంలో క్రికెట్ వ్యవహారంలో గత ఆరు నెలలుగా పరిస్థితేం బాగా లేదు. అటు ఆట జరిగాలి.

ఇటు జీవితాలూ నిలవాలి కాబట్టి అన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. ఐపీఎల్‌ జరిగేందుకు ఏమాత్రం అవకాశం లేదని భావించిన సమయంలో మేం దానిని నిర్వహిం చి చూపించడం సంతోషంగా ఉంది' అని గంగూలీ వ్యాఖ్యానించాడు. తన మార్గదర్శనంపై ఢిల్లీ క్యాపిటల్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకే వస్తాయనే విమర్శలపై కూడా 'దాదా' పెదవి విప్పాడు. సుమారు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన తను అయ్యరే కాదు, కోహ్లి...

ఇంకే ఆటగాడు అడిగినా సాయమందిస్తానని చెప్పాడు. అంత మాత్రాన దీనికి విరుద్ధ ప్రయోజనాలు అపాదించడం తగదని హితవు పలికాడు. మరోవైపు ధోని సాధించిన ఘనతలను బట్టి చూస్తే అతనిడి అన్ని విధాలా గౌరవించుకోవాలన్న గంగూలీ... ప్రస్తుత పరిస్థితుల్లో ధోని వీడ్కోలు మ్యాచ్‌ విషయంపై మాత్రం ఏమీ చెప్పలేనని స్పష్టం చేశాడు.

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రోజునే మహేంద్ర సింగ్ ధోనీతో మాట్లాడాను. కానీ ఐపీఎల్ సీజన్‌లో నేరుగా తనను కలిసి మాట్లాడే వీలులేదు. వారంతా బయో బబుల్‌లో ఉంటున్నారు కాబట్టి ఏ విషయంలోనైనా సంప్రదింపులకు తావు లేదని గంగూలీ చెప్పాడు. కానీ భారత్‌కు తాను సాధించిపెట్టిన విజయాలను గమనిస్తే ధోనీ అన్నింటికీ అర్హుడేనని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అయితే కోవిడ్ కారణంగా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని ఏమాత్రం ఊహించలేమని, నువ్వు వచ్చి పలానా ఆట ఆడు అని చెప్పడానికి ఇప్పడు అసాధ్యమని గంగూలీ పేర్కొన్నాడు.