Breaking News

చైనా సరిహద్దులో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు... చైనా కు చుక్కలు చూపిస్తున్న భారత్...!


చైనా సరిహద్దులో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. లడఖ్‌లోని కీలక ప్రాంతాల్లో ఆధిపత్యం సాధించాలని చైనా దళాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ, భారత సైన్యం ఇప్పటికే పలుమార్లు షాకిచ్చింది. పాంగాంగ్ సరస్సు సమీపంలో ఎత్తైన కొండలను స్వాధీనం చేసుకోవడానికి పీఎల్‌ఏ (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) జవాన్లు ప్రయత్నించగా.. అంతకంటే రెండు గంటల ముందే అక్కడ చేరుకొని భారత దళాలు షాకిచ్చాయి. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే 6 కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. అంతకంటే ముందు గల్వాన్ లోయలో చైనా బలగాలకు ఊహించని షాక్ తగిలింది. భారత్‌ను దొంగ దెబ్బ తీయాలని భావించి ఖంగు తింది. నాటి ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులు కాగా..

చైనా వైపు 60 మంది మరణించి ఉంటారని అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొన్నారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న చైనా సరిహద్దులో పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వాటికి భారత్ దీటుగా బదులిచ్చింది. భారత్ శక్తి ఏమిటో ఇప్పటికే చైనా దళాలకు అర్థమైంది.

పీఎల్‌ఏకు చెందిన కొంత మంది జవాన్లు భారత సరిహద్దులో విధులు నిర్వహించడానికే భయపడుతున్నట్లు కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. చైనా సైన్యంలో పని చేసిన మాజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఒకరు ఆ దేశ సైనికులను హెచ్చరించారు. భారత్‌ను తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు.

గతంలో నాన్‌జింగ్‌ మిలటరీ రీజియన్‌కు డిప్యూటీ కమాండర్‌గా పనిచేసిన వాంగ్‌హాంగ్‌ యాంగ్‌.. చైనా బలగాలు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారత్‌ షాక్‌ ఇస్తుందని హెచ్చరించారు. లిజిన్‌ అనే ఓ సోషల్ మీడియా అకౌంట్ ఈ విషయాన్ని తెలిపినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు పేర్కొంది. చైనా రక్షణ సంబంధ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను లిజిన్ వెల్లడిస్తుంది.

చైనా దళాలకు పోటీగా సరిహద్దులో భారత్‌ భారీ సంఖ్యలో జవాన్లను తీసుకొచ్చిందని వాంగ్‌హాంగ్‌ యాంగ్‌ తెలిపారు. వాస్తవానికి ఎల్‌ఏసీ నిర్వహణకు 50 వేల మంది సరిపోతారని.. కానీ, భారత్‌ దీనికి అదనంగా మరో లక్ష మందిని తరలించిందని ఆయన హెచ్చరించారు. సాధారణంగా శీతాకాలంలో దళాల ఉపసంహరణ జరుగుతుందని..

కానీ, ఇందుకు భిన్నంగా సరిహద్దుకు సైనికులను భారీగా తరలిస్తున్నారని ఆయన తెలిపారు. చైనా సరిహద్దులకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో భారత దళాలు భారీగా మోహరించి ఉన్నాయని.. ఒకవేళ యుద్ధం మొదలైతే కొన్ని గంటల్లోనే చైనాలోకి దూసుకు వచ్చే సామర్థ్యం వీటికి ఉందని వాంగ్‌హాంగ్.. తమ దేశ సైన్యాన్ని హెచ్చరించారు.