Breaking News

ఐసెట్ ఫలితాలు విడుదల. ఐసెట్ ఫలితాలు విడుదల.


కరోనా విజృంభణతో సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నీ ఆ సమయంలో ఆగిపోయాయి. పదో తరగతితో సహా పాఠశాలల విద్యార్థులందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను ఆయా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఏపీలో ఐసెట్ నిర్వహించారు. ఆ పరీక్ష ఫలితాలను నేడు అమరావతిలో మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరీక్షకు మొత్తం 51,991 మంది విద్యార్థులు హాజరు కాగా.. 40, 890 ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. 78.65 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారని చెప్పారు.

టాప్ 10 లో నలుగురు అమ్మాయిలు ఉన్నారన్నారు. మొదటి 10 ర్యాంకుల్లో ఆరు ర్యాంకులు వెనకబడిన కులాలు, షెడ్యూల్ కులాలకు చెందినవారు సాధించారని మంత్రి సురేష్ వివరించారు. కేవలం రెండు వారాల్లో పరీక్ష ప్రక్రియ పూర్తి చేసి రికార్డ్ టైం లో ఫలితాలు విడుదల చేశామన్నారు. ఈ రోజుతో ఎంసెట్ పరీక్షలు పూర్తి అయ్యాయన్నారు. ఇంజనీరింగ్ లో 156899 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ లో 75834 మంది హాజరయ్యారని చెప్పారు. ఎంసెట్ లో 21 మంది కరోనా కారణంగా పరీక్షకు హాజరు కాలేదన్నారు.  ఐసెట్ లో సైతం కరోనా కారణంగా ఆరుగురు హాజరు కాలేదని చెప్పారు. అక్టోబర్ 7 న వారికి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

ఈ సారి కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదన్నారు. దీంతో ఈ సారీ పది ఫలితాలకు బదులుగా కామన్ ఎంట్రన్స్ టెస్టు ద్వారా ఐఐఐటీ ప్రవేశాలు నిర్వహిస్తాన్నారు. ఈ మేరకు అర్జికేటి తీర్మానం చేసిందని మంత్రి చెప్పారు. 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుందన్నారు. పార్ట్ 1లో 50 మార్కులకు మాథ్స్, పార్ట్ 2లో 50 మార్కులకు సైన్స్ ప్రశ్నలు ఉంటాయన్నారు. ప్రత్యక్ష పద్ధతిలోనే పరీక్షలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రతీ మండలానికి ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామన్నారు.  తెలంగాణలో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 10 వ తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష ఉంటుందన్నారు. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ఈ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు.