Breaking News

విశాఖపట్నంకి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు


విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ప్రతిష్ఠాత్మక బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేట్‌ లభించింది. విశాఖ రుషికొండ బీచ్‌ను అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని తీర ప్రాంత పర్యాటక కేంద్రాలకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ దక్కుతుంది. డెన్మార్క్‌లోని పర్యావరణ, అధ్యయన సంస్థ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను అందజేస్తుంది. ఆదివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు ఎంపికైన బీచ్‌ల జాబితాను ఆ సంస్థ విడుదల చేసింది.

ఇందులో రుషికొండ బీచ్‌కు చోటు లభించింది. ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందుకున్న బీచ్‌లను అన్ని రకాలుగా అత్యంత సురక్షితమైనదిగా భావిస్తారు. కాలుష్యం లేకపోవడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పర్యాటకులకు భద్రత కల్పించడం, తీర ప్రాంతంలో సముద్ర జలాల నాణ్యత, కాలుష్య రహితం, పర్యావరణ హితం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ఆయా తీర ప్రాంత పర్యాటక కేంద్రాలను ఎంపిక చేస్తారు.