Breaking News

మూడు కీలక పథకాలను వర్చువల్ విధానం ద్వారా జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ


SATYASHILA TV : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం బీహార్‌లో పెట్రోలియం రంగానికి సంబంధించి మూడు కీలక పథకాలను వర్చువల్ విధానం ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ పథకాల్లో పారాదీప్-హల్దియా-దుర్గాపూర్ పైప్‌లైన్ అభివృద్ధి పథకం పరిధిలోగల దుర్గాపూర్-బంకా విభాగం పైప్‌లైన్‌ నిర్మాణంసహా రెండు వంటగ్యాస్‌ బాట్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు చేశారు. పెట్రోలియం-సహజ వాయువు మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు 'ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్‌' వీటిని చేపట్టాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- బీహార్ కోసం కొన్నెండ్ల కిందట ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనపై అధికశాతం దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీలో పెట్రోలియం, గ్యాస్‌కు సంబంధించి రూ.21 వేల కోట్ల విలువైన 10 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిలో భాగంగా ఈరోజు ఇది బీహార్ ప్రజలకు అంకితం చేస్తున్న 7వ పథకమని ప్రధాని గుర్తుచేశారు. అలాగే బీహార్‌లో ఇప్పటికే పూర్తయిన ఆరు ఇతర పథకాల జాబితాను కూడా ఆయన ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఒక కీలక గ్యాస్ పైప్‌లైన్‌ పథకంలో భాగంగా ఏడాదిన్నర కిందట తాను శంకుస్థాపన చేసిన దుర్గాపూర్-బంకా విభాగాన్ని (సుమారు 200 కిలోమీటర్లు) నేడు ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సంక్లిష్ట భూభూగం గుండా ఈ పైప్‌లైన్‌ నిర్మించడం సవాలుతో కూడుకున్నదైనప్పటికీ సకాలంలో పనులను పూర్తిచేయడంలో కఠోరంగా శ్రమించిన ఇంజనీర్లు, సిబ్బంది కృషికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు మద్దతునిచ్చిందని ఆయన ప్రశంసించారు. ఒక తరం పని ప్రారంభిస్తే మరో తరంలోగానీ పనులు పూర్తికాని సంస్కృతి నుంచి బీహార్‌ను సమున్నత స్థితికి తేవడంలో ఎంతో గొప్ప పాత్ర పోషించారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కొనియాడారు. ఈ కొత్త పని సంస్కృతి ఇలాగే కొనసాగుతూ మరింత బలోపేతమై బీహార్‌ను, తూర్పు భారతాన్ని ప్రగతిపథంలో నడపాలని ఆకాంక్షించారు. సహజ వనరులు దండిగా ఉన్నా బీహార్, తూర్పు భారత ప్రాంతాలు దశాబ్దాలుగా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ, ఆర్థిక కారణాలతోపాటు ఇతరత్రా ప్రాథమ్య వ్యత్యాసాలవల్ల ఈ ప్రాంత ప్రగతిలో ప్రజలు వెనుకబడ్డారని వివరించారు. రోడ్డు-రైలు-గగన మార్గాలతోపాటు ఇంటర్నెట్ అనుసంధానానికి లోగడ ప్రాధాన్యం ఉండేది కాదన్నారు. అటువంటి పరిస్థితి ఉన్నపుడు బీహార్‌లో గ్యాస్ ఆధారిత పరిశ్రమ, పెట్రో అనుసంధానం వంటివాటిని కలనైనా ఊహించడం అసాధ్యమేనని పేర్కొన్నారు. కాగా, బీహార్‌కు అన్నివైపులా భూ సరిహద్దులున్నందున సముద్ర తీర రాష్ట్రాలకుగల సౌలభ్యం లేకపోవడంతో రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి పెను సవాలుగా ఉందన్నారు.