Breaking News

తెలంగాణలో వచ్చే ఆరు నెలలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ': వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్


హుజూరాబాద్‌, జమ్మికుంట పట్టణాల రూపురేఖలు మారుస్తానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రెండు మున్సిపాలిటీల్లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు మోడల్‌ టౌన్‌లుగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మాసబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఆ రెండు పట్టణాలు తనకు రెండు కళ్లలాంటివని ఈ సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు.
గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హుజూరాబాద్‌ మున్సిపాలిటీకి రూ.50కోట్లు, జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.40కోట్ల అదనపు నిధులు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. వాటిని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టాలని అధకారులకు మంత్రి సూచించారు. పట్టణాల్లో ఎక్కడా కూడా మురుగు నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లు, డ్రైనేజీ, టౌన్‌ ప్లానింగ్‌ పనులు రాబోయే వంద సంవత్సరాలకు అనుగుణంగా ఉండాలని.. తాత్కాలికంగా చేయొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, సీడీఎంఏ సత్యనారాయణతోపాటు జమ్మికుంట మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజేశ్వర్‌ రావు, వైస్‌ ఛైర్మన్‌ స్వప్న, కమిషనర్‌ రషీద్‌, హుజూరాబాద్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ గందే రాధిక, వైస్‌ ఛైర్మన్‌ నిర్మల, కమిషనర్‌ జోనాలు హాజరయ్యారు.