Breaking News

జాతీయ పార్టి పెట్టె కార్యాచరణ మొదలెట్టిన కెసిఆర్


SATYASHILA TV : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. గతంలో ఆయన వివిధ ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని భావించే వారు. కానీ, ఇప్పుడు ఆయన కొత్తగా జాతీయ స్థాయిలో ఒక పార్టీనే పెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇవాళ జరగబోతున్న టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి సంబంధించి ఒక పేరును కూడా కేసీఆర్ ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. నయా భారత్ పార్టీ అనే పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ప్రక్రియ కూడా టీఆర్ఎస్ ప్రారంభించిందని తెలుస్తోంది. అవసరమైతే జాతీయ పార్టీ పెడతామని టీఆర్ఎస్ నేతలు గతంలోనే కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పుడు అడుగులు పడుతున్నట్లు అర్థం చేసుకోవాలి. పార్టీ ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ వివిధ రంగాల ప్రముఖులతోనూ చర్చలు జరపనున్నట్లు చెబుతున్నారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కలుపుకొని వెళ్లి కొత్త పార్టీని స్థాపించాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వంటి వారు కలిసివస్తారనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 2022 చివరిలో లేదా 2023 మొదట్ల జమిలి ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతున్నట్లు నేపథ్యంలో వీలైనంత త్వరగా జాతీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.