Breaking News

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం : కీలక అంశాలపై చర్చ


తెలంగాణ కేబినెట్ రేపు సమావేశం కానుంది. సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్రమంత్రి వర్గ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. ఎన్నో అక్రమాలు, అవినీతిని మూటగట్టుకున్న రెవెన్యూశాఖను ప్రక్షాళనుచేయాలని ఇది వరకే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రైతుల భూ వివాదాలకు సులభంగా పరిష్కారం లభించాలన్నదే తమ లక్ష్యమని గతంలోనే చెప్పారు. ఐతే రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడం.. అదే రోజు రాత్రి కేబినెట్ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం సభలో రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశాలు నిర్వహించనున్నారు. అందుకోసం అసెంబ్లీ, మండలిలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఉభయ సభల్లో సభ్యులు 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా.. అసెంబ్లీలో అదనంగా 40 సీట్లు, మండలిలో 8 సీట్లు కేటాయించారు. సభ్యులంతా విధిగా మాస్క్ ధరించాలి. సమావేశాల ప్రారంభానికి ముందే అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఆదివారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటికే మంత్రి హరీష్ రావుకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. మరింత అప్రమత్తమైన అసెంబ్లీ అధికార యంత్రాంగం సభ్యులందరికి పరీక్షలు చేస్తోంది. నెగెటివ్ వచ్చిన మారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.