Breaking News

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ మరోసారి ఎన్నిక


SATYASHILA TV ·: రాజ్యసభలో కీలకమైన డిప్యూటీ చైర్మన్ స్థానానికి ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. జేడీయూ పార్టీకి చెందిన హరివంశ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ప్రతిపాదించగా, థావర్ చంద్ సమర్థించారు. యూపీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝాపై హరివంశ్ విజయం సాధించినట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. తొలుత 2018లో కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్ ను ఓడించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ సింగ్ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ లో ముగిసింది. రెండోసారి ఆయననే అభ్యర్థిగా నిలపాలని ఎన్టీఏ కూటమి డిసైడైంది. మొత్తం 245 స్థానాలున్న రాజ్యసభలో ఎన్డీఏ బలం 113 మాత్రమే కావడంతో.. హరివంశ్ కు మద్దతు కోసం ఇతర పార్టీలను జేడీయూ ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపగా, తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ మాత్రం ఓటింగ్ కు దూరంగా నిలిచింది. యూపీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా ఓడిపోయినప్పటికీ.. ప్రతిపక్ష పార్టీల నేతలు.. విజేత హరివంశ్ సింగ్ కు అభినందనలు తెలిపారు. డిప్యూటీ చైర్మన్ బాధ్యతలను హరివంశ్ సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్, ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు.