Breaking News

స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ జరిమానా


స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ జరిమానాకు గురయ్యాడు. గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలింగ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు కావడంతో టీమ్‌ కెప్టెన్ కోహ్లీ ఫీజులో రూ.12 లక్షల కోత విధించారు. ‘సెప్టెంబర్‌ 24న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు స్లో ఓవర్‌ రేటు చేయడంతో ఆ టీమ్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి జరిమానా విధించాం’ అని లీగ్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఓ కెప్టెన్‌ జరిమానాకు గురికావడం ఇదే మొదటిసారి. హైదరాబాద్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో చెలరేగి ఆడిన కోహ్లీ సేన పంజాబ్‌తో పోరులో చతికిలబడింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ జట్టు కెప్టెన్‌ రాహుల్‌ (69 బంతుల్లో 132) విజృంభణతో 206 పరుగులు చేసింది. కోహ్లీ జారవిడిచిన రెండు క్యాచ్‌లు కూడా రాహుల్‌కు కలిసివచ్చాయి.
 అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. పంజాబ్‌ బౌలింగ్‌ ధాటికి ఓ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా క్రీజులో నిలవలేకపోయాడు. 109 పరుగులకే ఆ జట్టు కుప్పకూలిపోయింది. డివిలియర్స్‌ (28), వాషింగ్టన్‌ సుందర్‌ (30) పోరాటంతో ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. 28వ తేదీన బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయితో తలపడనుంది.