Breaking News

ఇంధనం నింపుతుండగా కుప్పకూలిన అమెరికా జెట్‌ ఫైటర్‌


అమెరికా వైమానికదళానికి చెందిన ఎఫ్ -35 బీ ఫైటర్ జెట్ విమానం మంగళవారం కుప్పకూలింది. ఆకాశంలోనే ఉండగా ఇంధనం నింపుతున్న సమయంలో రీఫ్యూయలింగ్ ట్యాంకర్‌తో ఢీకొనడంతో జెట్‌ ఫైటర్‌ కూలిపోయింది. ఈ విషయాన్ని యూఎస్ మెరైన్స్ యూనిట్ వెల్లడించింది.

ఎఫ్ -35 బీ జెట్‌కు కేసీ-130 జే ద్వారా ఇంధనం నింపే ప్రక్రియను విజయవంతంగా ప్రారంభించారు. అయితే కొద్దిసేపటికే రీఫ్యూయలింగ్ ట్యాంకర్‌ను జెట్‌ ఫైటర్‌ ఢీకొట్టింది. దాంతో ఆ ఫైటర్‌ విమానం అదుపుతప్పి కుప్పకూలింది. ఈ ప్రమాదం కాలిఫోర్నియాలోని ఇంపీరియల్ కౌంటీలో జరిగింది. ఇంధనం నింపే విమానం థర్మల్ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. అందులోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు 3 వ మెరైన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వింగ్‌ తెలిపింది.