Breaking News

పోలీసుల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్


సైబర్ నేరాలు ఇప్పుడు పోలీసులకు తలనొప్పిగా మారాయి . సోషల్ మీడియా ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు . ఫేస్ బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా ఏపీలోనూ పోలీసులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్ళు పోలీసుల పేరుతో నకిలీ ఖాతాలు తెరుస్తున్నారు. చాటింగ్ చేసి పోలీసులని నమ్మిన వారి నుండి అందినకాడికి దోచుకుంటున్నారు .పోలీసుల అకౌంట్ లే హ్యాక్ చేసి వసూళ్ళకు తెర తీస్తున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి .పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి ఆ ఎకౌంట్ల ద్వారా డబ్బు కావాలంటూ మెసేజ్ లు పెట్టి పోలీసుల పేరుతోనే దందాలు చేస్తున్న సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు ఏకంగా అకౌంట్స్ హ్యాక్ చెయ్యటం మొదలెట్టారు . తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు 50మంది పోలీసు అధికారుల పేర్లతో సైబర్ నేరగాళ్ళు ఫేక్ అకౌంట్స్ తెరవగా, ఇదే క్రమంలో ఏపీలో కూడా భారీగానే పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్స్ నిర్వహిస్తున్నట్టుగా తాజాగా గుర్తించారు. అంతే కాదు అకౌంట్స్ హ్యాక్ కూడా చేస్తున్నట్టు గుర్తించారు.తాజాగా పలువురు పోలీసులు పేరుతో ఫేస్ బుక్ మెసెంజర్ ద్వారా డబ్బులు కావాలని మెసేజ్ లు పంపి, డబ్బులు వసూలు చేయాలని ప్రయత్నం చేశారు. ఏపీ లోని తిరుమల, తిరుపతికి చెందిన పలువురు పోలీసు అధికారుల ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు వారి పేరుతో డబ్బుల వసూలుకు యత్నించారు. ఇక దీనిపై పోలీసులకు సమాచారం అందటంతో సిఐలు రామకృష్ణ, గిరిధర్ , ఎస్సైలు తిమ్మయ్య, సుమతి ఫేస్ బుక్ అకౌంట్లు హ్యాక్ కు గురైనట్లుగా గుర్తించారు . పోలీసులు వారి అకౌంట్లను తక్షణం బ్లాక్ చేశారు.తమ పేరుతో వచ్చే సందేశాలకు ఎవరు రెస్పాండ్ కావద్దు అంటూ పోలీసులు సూచిస్తున్నారు. తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు తమ అకౌంట్ ను హ్యాక్ చేసిన నేరగాళ్లను గుర్తించాలని కోరారు.ఈ తరహా సైబర్ నేరాలు నిత్యకృత్యంగా మారుతూ ఉండటంతో సోషల్ మీడియా సేఫ్ కాదు అనే భావన కలుగుతుంది. ప్రొఫైల్ సెట్టింగ్స్ లో ప్రైవసీ సెట్టింగ్ పెట్టుకోకపోతే ఈ తరహా సైబర్ మోసాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే అటువంటి పోలీసుల అకౌంట్స్ హ్యాక్ కు గురవుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.