Breaking News

అమెరికా 20 ఏళ్లలో చేసిన అతి ముఖ్యమైన సంస్కరణ



హెచ్1బీ వీసాలకు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన అతి ముఖ్యమైన సంస్కరణ ఇది అని అమెరికా లేబర్ డిప్యూటీ సెక్రటరీ ప్యాట్రిక్ పిజ్జెల్లా వెల్లడించారు. ఈ ఆంక్షలు త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉందనీ తెలిపారు. సాధారణంగా ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం సుమారు 85వేల హెచ్‌1బీ వీసాలను జారీ చేస్తుంటుంది. అయితే తాజా నియమావళి ప్రకారం ఆ సంఖ్యను పావు వంతు తగ్గిస్తున్నట్లు హోమ్‌ల్యాండ్ యాక్టింగ్ డిప్యూటీ సెక్రటరీ కెన్ కుసినెల్లి తెలిపారు. మూడో వంతు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని వెల్లడించారు. ఏటా జారీ అయ్యే 85వేల హెచ్1 బీ వీసాల్లో చైనా, భారతీయ పౌరులే దాదాపు 50వేల వీసాలు పొందుతుంటారు. ఐతే ఈ వీసాలను అమెరికా తగ్గించనుండడంతో ఇరు దేశాల టెకీలపై తీవ్ర ప్రభావం పడనుంది.కరోనా నేపథ్యంలో హెచ్‌1బీ వీసా జారీలని రద్దు చేస్తూ జూలైలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించే ఈ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు. కాగా, హెచ్‌1 బీ ప్రోగ్రామ్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ సమయంలో అమలు చేశారు. టెకీ రంగంలో ప్రత్యేకమైన ఉద్యోగాలు, క్వాలిఫైడ్ వర్కర్ల కోసం ఈ విధానాన్ని తెచ్చారు.


అమెరికాలోని కంపెనీల్లో ప్రత్యేక పోస్టుల్లో విదేశీయులు తాత్కాలికంగా పనిచేయాలంటే హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా తీసుకోవడం తప్పనిసరి. ఐటీ, ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్ లాంటి రంగాల్లో నిపుణులకు మాత్రమే హెచ్-1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం మంజూరు చేస్తోంది. అమెరికాలోని కంపెనీలు వర్క్ వీసాలాగా హెచ్-1బీ వీసాలను జారీ చేస్తుంటాయి. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లిన వేలాది మంది టెకీలు హెచ్-1బీ వీసాలతోనే ఉద్యోగం చేస్తున్నారు.


డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఏప్రిల్‌లో ఇమ్మిగ్రెంట్ వీసాలపై ట్రంప్ నిషేధం విధించారు. EB2, EB3 ఈ కోవలోకి వస్తాయి. ఈ వీసాల ద్వారా గ్రీన్ కార్డు పొంది.. అమెరికాలో శాశ్వత నివాస హోదా పొందాలనుకున్న వారి ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. తాజాగా H1 B వీసాల జారీ విధానాన్ని కూడా సమీక్షిస్తూ.. భారత టెకీలకు షాకిచ్చారు డొనాల్డ్ ట్రంప్.