Breaking News

26,27 తేదీల్లో రైతుల ఆందోళనకు సంఘీభావం


 కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న నిరంకుశ, అప్రజాస్వామిక, దేశ వ్యతిరేక విధానాలపై విస్తృత పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. నూతన వ్యవసాయ చట్టాలు, లేబర్‌ కోడ్‌లు, ప్రయివేటీకరణ ద్వారా ప్రభుత్వ సంస్థల(పీఎస్‌యూ)ల నిర్వీర్యం, జాతీయ ఆస్తుల దోపిడీ, దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగంపై ఆందోళనలో నిర్వహించడంతో పాటు ప్రచారం ద్వారా ప్రజలకు వివరించాలని పేర్కొంది. ఇప్పటికే కరోనా నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రోజురోజుకు అకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు మరింత భారాన్ని మోపుతున్నాయని తెలిపింది.

కరోనా నేపథ్యంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ అక్టోబర్‌ 30, 31 తేదీల్లో జరిపిన వర్చువల్‌ సమావేశంలో పలు అంశాలపై కూలంకషంగా చర్చించి ఒక ప్రకటన విడుదల చేసింది.
కరోనా విజృంభణ
కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న మొదటి మూడు దేశాల్లో అమెరికా, భారత్‌, బ్రెజిల్‌ వరుసగా నిలిచాయి. కరోనా కేసులేే కాదు, మరణాలు కూడా ఈ దేశాల్లో రికార్డు స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. భారత్‌లో పాజిటివ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మహమ్మారిని అదుపు చేయాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం, మోడీ గాలికొదిలేశారని విమర్శించింది. అటు వైరస్‌ ఇటు తీవ్రతరమవుతున్న ఆర్థిక మాంద్యం ప్రజల పాలిట శాపాల్లా పరిణమించాయి. మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుండి ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని, నగదు బదిలీ చేయాలని సీపీఐ(ఎం) పదే పదే డిమాండ్‌ చేసినా మోడీ దానిని మొండిగా తిరస్కరిస్తూ వస్తున్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, ఆకలి బాధలు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రజలకు ఊరట కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.