Breaking News

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్ 45 రోజుల లాంఛ్ ప్యాడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్



డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. ఫ్లిప్‌కార్ట్ 45 రోజుల లాంఛ్ ప్యాడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ప్రకటించింది. టైర్ 2 సిటీస్‌కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇ-కామర్స్ ఇండస్ట్రీలో ప్రొఫెషనల్‌గా అడుగుపెట్టేందుకు ఈ స్కిల్స్ ఉపయోగపడతాయని చెబుతోంది ఫ్లిప్‌కార్ట్. రాబోయే పండుగ సీజన్ కోసం ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. భారతదేశంలో భవిష్యత్తులో సప్లై చైన్ రంగంలో లభించబోయే ఉద్యోగావకాశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. తెలంగాణలోని మేడ్చల్‌తో పాటు దేశంలోని 21 ప్రాంతాల్లో విద్యా సంస్థలతో కలిసి లాంఛ్ ప్యాడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు విద్యార్థులను ఎంపిక చేస్తోంది ఫ్లిప్‌కార్ట్. మెరిట్ విద్యార్థులను గుర్తించి వారిని ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో ఇంటర్న్స్‌గా ఎంపిక చేయనుంది.

సాధారణంగా ఫెస్టివల్ సీజన్‌లో నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి. దీంతో ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలో వస్తువుల ప్యాకింగ్ నుంచి డెలివరీ వరకు అనేక విభాగాల్లో తాత్కాలికంగా ఉద్యోగుల అవసరం ఉంటుంది. అందుకే సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో వేర్వేరు విభాగాల్లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశమిస్తోంది ఫ్లిప్‌కార్ట్. గతేడాది కూడా ఫెస్టివల్ సీజన్‌లో లాంఛ్ ప్యాడ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహించింది ఫ్లిప్‌కార్ట్. అప్పుడు దేశవ్యాప్తంగా 2000 మందికి పైగా విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈసారి కూడా ఇదే ప్రోగ్రామ్ ప్రకటించింది. ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల ఆరోగ్యం, భద్రత కోసం చర్యలు తీసుకుంటోంది ఫ్లిప్‌కార్ట్. ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్ల లోపలికి వచ్చే ముంది థర్మల్ స్క్రీనింగ్‌ నిర్వహించడం, సోషల్ డిస్టెన్సింగ్ నియమనిబంధనలు పాటించడం, అన్ని వేళలా ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించడం లాంటి ప్రమాణాలు పాటించనుంది.


ప్రతీ ఏడాది దసరా, దీపావళి పండుగ సీజన్ సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తుంది ఫ్లిప్‌కార్ట్. ఈసారి అక్టోబర్ 16 నుంచి 21 వరకు ఈ సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందురోజే సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్లు, హోమ్ అప్లయెన్సెస్, టెలివిజన్లు, ఫ్యాషన్ వేర్ లాంటి ప్రొడక్ట్స్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి.