Breaking News

ఫ్రాన్స్‌ లో 700 కిలోమీటర్ల ట్రాఫిక్‌ జామ్‌


 ఎటుచూసిన వాహనాలే. లైట్లతో రహదారులన్నీ మిరుమిట్లు గొలుపుతున్నాయి. వాహనాల హారన్లతో రోడ్లన్నీ మార్మోగిపోతున్నాయి. పదులు కాదు.. వందలు కాదు.. వేలల్లోనే వాహనాలు రోడ్లపై నిలుచున్నాయి. గంటల తరబడి ఇలా వాహనాల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. కనుచూపు మెరను దాటి పారిస్‌ నగరం చూట్టూ ఈ పరిస్థితి నెలకొని.. కనీవినీ ఎరుగని రీతిలో 700 కీలో మీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఇంతలా ఫ్రాన్స్‌లో ట్రాఫిక్‌ జాబ్‌ కావడానికి ప్రధాన కారణం కరోనాయే.

ఇటీవల ఫ్రాన్స్‌లో కరోనా వైరస్‌ ప్రభావం తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించింది. కానీ గత వారం రోజులుగా తీవ్రస్థాయిలో విజృంబిస్తున్నది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ 1 వరకూ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు ఫ్రాన్స్‌ ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ముఖ్యంగా దేశ రాజధాని పారిస్‌ సహా ప్రధాన నగరాల్లో కోవిడ్‌-19 ప్రభావం అధికంగా ఉన్నదనీ, అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యవసరాలు మినహా మిగతా సమయాల్లో బయటకు రావొద్దని ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే నగరం నుంచి స్వస్థలాలకు వెళ్లేవారు, ఇతర ప్రాంతలకు హాలీడే ట్రిప్‌ల కోసం వెళ్లినవారు తిరిగి వస్తుండటంతో పారిస్‌ నగరం చుట్టూ ఉన్న రోడ్లన్నీ వావానాలతో కిక్కిరిసిపోయాయి. దాదాపు 700 కీలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదివరకూ లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయంలోనూ ఫ్రాన్స్‌లోని చాలా నగరాల్లో ఇలాంటి పరిస్థితే దాపురించింది. ఫ్రాన్స్‌లో తాజాగా 50 వేలకు దగ్గరగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కరోనా కేసుల నమోదులో పెరుగుదల చోటుచేసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే మళ్లీ లాడ్‌డౌన్‌ విధించారు.