Breaking News

మక్కా ఉమ్రా యాత్రను ప్రారంభించిన సౌదీ అరేబియా అధికారులు


ముస్లింల పవిత్రనగరమైన మక్కా ఉమ్రా యాత్రను సౌదీ అరేబియా అధికారులు ఆదివారం ప్రారంభించారు. సౌదీ అరేబియా దేశంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధారణ అనంతరం.. రియాద్‌ మార్చిలో తీర్థయాత్రను నిలిపివేసింది. యాత్రను పలు దశల్లో తిరిగి ప్రారంభిస్తున్నారు. మొదటిదశలో ఆదివారం నుంచి 30 శాతం ప్రారంభమవుతుంది. రెండో దశ ఈ నెల 18న 75శాతం మంది యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నారు. నవంబర్‌ 1 నుంచి ఉమ్రా విదేశీ యాత్రికులందరినీ క్రమంగా అనుమతి ఇవ్వనున్నారు. యాత్రను వందశాతం నిర్వహించడం 'కరోనా మహమ్మారి'పైనే ఆధారపడి ఉందని మంత్రిత్వశాఖ పేర్కొంది. రియాద్‌లోని 1.08లక్షల మంది విదేశీలు, స్థానిక యాత్రికులు యాత్రలో పాల్గొనేందుకు అనుమతి పొందారు. కరోనా మార్గదర్శకాలను పాటించడంతో పాటు, రక్షణ చర్యలు తీసుకోనున్నారు. మసీద్‌లో ఉమ్రా ఆచారాలను పర్యవేక్షించేందుకు వెయ్యి మంది సిబ్బందిని నియమించి, శిక్షణ ఇచ్చారు. ఆరోగ్య పరీక్షలు చేసేందుకు థర్మల్‌ కెమెరాలను హాళ్లలో, ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేశారు. అలాగే మసీదును నిత్యం పదిసార్లు శుభ్రం చేయనున్నట్లు అరబ్‌ న్యూస్‌ వెల్లడించింది. ఇది ఇలా ఉండగా.. ఆదివారం నాటికి, సౌదీ అరేబియాలో మొత్తం 3,35,997 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, 4,850 మరణాలు నమోదయ్యాయి.