Breaking News

సత్తాచాటిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌



సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సత్తాచాటింది. తాము మనసు పెట్టి ఆడితే ప్రత్యర్థి ఎవరైనా మట్టికరువాల్సిందేనన్న రీతిలో చెలరేగింది. విధ్వంసక ద్వయం బెయిర్‌స్టో, వార్నర్‌ వీర బాదుడుతో 200 స్కోరు అందుకున్న రైజర్స్‌..బౌలింగ్‌లోనూ చెలరేగుతూ పంజాబ్‌ భరతం పట్టింది. సమిష్టి ప్రదర్శనతో హైదరాబాద్‌ బౌలర్లు చెలరేగుతూ కింగ్స్‌ను కట్టడి చేశారు. నికోలస్‌ పూరన్‌ ఒంటరిగా పోరాడినా.. సహచరుల సహకారం కరువైన పంజాబ్‌ ఐదో ఓటమిని ఖాతాలో వేసుకుంది. మరోవైపు భారీ విజయంతో వార్నర్‌సేన మూడో స్థానానికి ఎగబాకింది.
 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రైజర్స్‌ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యఛేదనలో..రషీద్‌ఖాన్‌ (3/12), అహ్మద్‌(2/24), నటరాజన్‌(2/24) విజృంభణతో పంజాబ్‌ 16.5 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. పూరన్‌(37 బంతుల్లో 77, 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. తొలుత హైదరాబాద్‌.. బెయిర్‌స్టో(55 బంతుల్లో 97, 7 ఫోర్లు, 6 సిక్స్‌లు), వార్నర్‌ (52) అర్ధసెంచరీలతో 20 ఓవర్లలో 201/6 స్కోరు చేసింది. బిష్ణోయ్‌(3/29)కు మూడు వికెట్లు దక్కా యి. బెయిర్‌స్టోకు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కింది.