Breaking News

ఊరంతా పండుగ


 రామాపురం ఓ మారుమూలకు గ్రామం, అభివద్ధికి ఆమడ దూరం. అనేక అసౌకర్యాలు ఆ ఊరిలో తిష్ట వేసుకు ఉన్నాయి. ఎన్నికల్లో నాయకులు వచ్చి మాయమాటలు చెప్పి వెళ్లేవారు. రాత్రికి రాత్రి ఓటుకు ఐదు వందలు పంచి మళ్ళీ ఆ గ్రామంలోకి వచ్చే వారు కాదు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇదే తంతు. ఈసారి నాయకులు చెప్పే మాటలు విని తలలు ఆడించారు అమాయక ప్రజలు.

''మీ సమస్యలు అన్ని తీరుస్తాం''. ఎప్పటిలాగే ఈ సారీ మీ ఊరులోని ఓట్లు మా పార్టీకే పడాలి అన్నారు. అమాయకంగా తలలూ ఊపారు ప్రజలు.
ఆ యేడు డిగ్రీ పూర్తి చేసుకుని ఊరులోకి అడుగు పెట్టాడు కిషోర్‌. ఆ ఉరి మొత్తానికి అతనొక్కడే చదువుకున్నవాడు. ఊరిలో తిష్ట వేసుకున్న సమస్యలు గురించి తెలుసుకున్నాడు.

ఎన్నికల నాయకులు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టించి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారో, ప్రజలు ఎలా నష్టపోతున్నారో అర్థం చేసుకున్నాడు. ఆ డబ్బు ఆ రోజు వారికి ఉపశమనం కలిగించవచ్చు కానీ తరువాత కాలంలో వారెలా నష్ట పోయేది వివరించి, వారిలో చైతన్యం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాడు.
మరుసటి రోజు ఆ ఊరి ప్రజలను రచ్చబండ దగ్గర సమావేశ పరచి ఇలా చెప్పాడు. ''ప్రజలారా! మనం డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నాం. దానితో నాయకులు మన ఊరి సమస్యలను పట్టించుకోవడం లేదు. వారి డబ్బు మనకు ఒక్క రోజులోనే ఖర్చు అయిపోతుంది. డబ్బు తీసుకోవడము నేరం. మన సమస్యలు పరిష్కరించాలంటే రేపు జరిగే ఎన్నికలలో ఎవరూ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్ళకుండా మీమీ ఇళ్ళలోనే ఉండండి. ఒక్క ఓటు కూడా ఏ పార్టీకి ఎవరూ వేయకూడదు. మన నిరశన సెగ వారి కళ్ళు తెరిపించాలి సరేనా!'' అన్నాడు. అందరూ సరేనని మాట ఇచ్చారు.
ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రము ఖాళీ. ఒక్క ఓటు కూడా పోల్‌ కాలేదు. ప్రజల చైతన్యం చూసి అధికారులు ఆశ్చర్య పోయారు. ఒక్క ఓటు కూడా పోల్‌ కాని రామాపురం గ్రామమని పత్రికలలో ప్రముఖంగా ప్రకటించారు.
ఎన్నికల ఫలితాలలో ఇరు పార్టీ అభ్యర్థులకు సరిసమాన ఓట్లు రావడ ముతో ఆ గ్రామ ఓట్లు కీలకమయ్యాయి. అయితే గ్రామ ప్రజలు ఓట్లు బహిష్కరణతో ఆ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించలేదు. అలానే రోజులు గడిచాయి. మళ్ళీ ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు రావడంతో ప్రతి పార్టీ వాళ్ళు ఆ గ్రామానికి రావడము మొదలు పెట్టారు. ఆఘమేఘాలపై ఇరుపార్టీల వారు ఆ ఊరికి అన్ని సౌకర్యాలు కల్పించారు.
ఆ ఊరి రూపు రేఖలే మారిపోయాయి. అన్ని సౌకర్యాలు ఉండటంతో కిషోర్‌ ఆ ఉరి ప్రజలతో ఇలా అన్నాడు ''చూశారా మన నిరశన ఫలితం. మీలో చైతన్యం వచ్చింది. ఈ విధముగా మనం ఐక్యతతో ఉంటే నాయకులకు కూడా తమ తప్పు తెలుస్తుంది. మీరు చైతన్యం పొందడమే కాకుండా, నాయకుల్లో కూడా చైతన్యం తెచ్చారు. ఈరోజు మనకు పండుగ. ఊరంతా పండుగ జరుపుకుందాం,'' అన్నాడు. ఊరి ప్రజలందరూ ఉగాదికి ముందే మాకు పండుగ వచ్చిందని ఆరోజే సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు.