Breaking News

విజయవాడలో మాంసం మాఫియా అక్రమాలు


విజయవాడలో మాంసం మాఫియా అక్రమాలు ఎక్కువయ్యాయి. వారాంతంలో మాసం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మార్గాల్లో మేక, గొర్రె మాంసాలు తీసుకొ్చ్చి ఎక్కువ ధరలకు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇలాంటి ఓ ముఠాను విజయవాడ రైల్వేస్టేషన్‌ పోలీసులు పట్టుకున్నారు.


ఢిల్లీ నుంచి విజయవాడ నగరానికి అక్రమంగా రవాణా చేస్తున్న 16 బాక్సుల మటన్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిల్వ ఉంచిన మాంసం నగరానికి దిగుమతి అయినట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఓ రైలు నుంచి దీన్ని దింపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బాక్సులను అక్రమంగా రవాణా చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారాంతంలో నగరానికి అక్రమంగా మాంసం దిగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భారీ ఎత్తున మాంసం లభ్యమైనట్లు భావిస్తున్నారు.


వాస్తవానికి నిన్న మొన్నటి వరకూ విజయవాడలో కరోనా కారణంగా ఆదివారం మాంసం అమ్మకాలపై నిషేధం ఉంది. తాజాగా పరిస్ధితులు మారడంతో మాంసం అమ్మకాలకు అనుమతిస్తున్నారు. దీంతో అక్రమ రవాణా కూడా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నిల్వ ఉంచిన మాంసాన్ని ఏయే హోటళ్లకు సరఫరా చేస్తున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సమాచారం అందుకున్న విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్ అధికారులు రైల్వే పార్శిల్‌ ఆఫీసుకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు.