Breaking News

ప్రశాంతంగా అపెక్స్ కౌన్సిల్ భేటీ

 


అపెక్స్ కౌన్సిల్ భేటీలో రెండు రాష్ట్రాల  ముఖ్యమంత్రుల మధ్య గత కొద్ది రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్లుగా మాటల మంటలేమీ చోటు చేసుకోలేదు. కాళేశ్వరం, పోతిరెడ్డిపాడు అనుమతుల విషయంలో మాత్రం కేసీఆర్, జగన్ ఇద్దరూ తమ తమ వాదన గట్టిగా వినిపించారు. సమావేశంలో కొన్ని కీలక అంశాలపై మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ అంగీకారానికి వచ్చినట్లుగా కేంద్ర జలశక్తి మంత్రి భైరాన్ సింగ్ షెకావత్ ప్రకటించారు. కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తి రేపిన అపెక్స్ కౌన్సిల్ భేటీ … హాట్ హాట్ గా సాగలేదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ..వర్చవల్ పద్దతిలోనే సమావేశానికి హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి కేసీఆర్ ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే జల వివాదాలపై తమ అభ్యంతరాలను సీఎంలు కేసీఆర్‌, జగన్‌ కౌన్సిల్ ముందుంచారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలు, ప్రాజెక్టుల నిర్వహణ.. గోదావరి జలాలను సమర్థంగా వాడుకోవడం, కృష్ణా బోర్డు తరలింపు లాంటి అంశాలపై చర్చించారు.


కృష్ణా, గోదావరి రివర్ బోర్డులను నోటిఫై చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి షెకావత్ ఈ విషయం చెప్పినప్పుడు కేసీఆర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే షెకావత్ మాత్రం.. ఈ అంశంపై కేంద్రానికి అధికారం ఉంందని స్పష్టం చేశారు. కృష్ణా జలాల పంపకాలు ప్రాజెక్టుల వారీగా జరగాలన్న తెలంగాణ డిమాండ్‌పై సంబంధిత ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంటుందని .. అవసరమైన న్యాయ సలహా తీసుకుంటామని షెకావత్ తెలిపారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ సంబంధిత బోర్డులు ద్వారా జరుగుతుందని ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం… సాగునీటి వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇద్దరు సీఎంలు సిద్ధంగా ఉన్నారని షెకావత్ చెుతున్నారు. రెండు రాష్ట్రాలు కొత్తగా నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టుల రిపోర్టులు.. సంబంధిత నదీ బోర్డులకు అందించాలని సమావేశంలో కేంద్ర మంత్రి షెకావత్ ముఖ్యమంత్రులకు సూచించారు. ఈ మేరకు డీపీఆర్‌లు సమర్పించేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారు. వాటిని పరిశీలించి అపెక్స్‌ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని షెకావత్ తెలిపారు. నీటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌కు ఉందని … కేఆర్‌ఎంబీ బోర్డు తరలించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయన్నారు.


కృష్ణా జలాల పంపిణీపై గతంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసు వేసింది. ఈ కేసును ఉపసంహరించుకునేందుకు కేసీఆర్ అంగీకరించారని షెకావత్ తెలిపారు. నదీ జలాల వాటాలపై సంబంధిత నదీ బోర్డులే తీసుకుంటాయని స్పష్టం చేశారు. పోలవరం వేగంగా పూర్తి చేయాలన్నదే కేంద్రం విధానమని.. బిల్లులు ఇచ్చిన మేరకు పోలవరానికి నిధులు విడుదల చేసేశామని స్పష్టం చేశారు. వీలైతే ఈ నెలాఖరులో పోలవరాన్ని సందర్శిస్తానని ప్రకటించారు.