Breaking News

ఏపీలోని సీఎం జగన్ సర్కార్ విద్యా, వైద్యం విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు



ఏపీలోని సీఎం జగన్ సర్కార్ విద్యా, వైద్యం విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా విద్యార్ధుల మధ్య సామాజిక అసమానతల తొలగింపు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వచ్చే నెల 2 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోన్న విషయం తెలిసిందే.  కాగా ఇకపై ఏపీలోని పాఠశాల హాజరు పట్టీలో విద్యార్ధుల కులం, మతం ప్రస్తావన ఉండదు. ఇప్పటివరకు విద్యార్ధులకు రిజర్వేషన్లు, ఇతర అవసరాల కోసం నమోదు చేసిన ఈ వివరాలను ఇకపై అటెండెన్స్  బుక్ నుంచి తొలగించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు పంపింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చిన వీరభద్రుడు ఆదేశించారు. అయితే స్కూలు రికార్డుల్లో మాత్రం కులం, మతం వివరాలు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగానే విద్యార్ధుల కులం, మతాల ఆధారాలు అందుబాటులో ఉంటాయని సమాచారం.   మరోవైపు పాఠశాల విద్యార్ధుల అటెండెన్స్  బుక్‌లో బాలికల పేర్లను రెడ్ ఇంక్‌తో రాసే మరో విధానానికి కూడా ప్రభుత్వం స్వస్తి పలికింది. ఒకే స్కూల్‌లో, ఒకే క్లాస్ రూమ్‌లో, ఒకే తరహాలో విద్యను అభ్యసిస్తున్న బాలికలు, బాలురను వేర్వేరుగా చూపించేలా ఉన్న ఈ విధానం కూడా తొలగించాలని పాఠాశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇకపై ఒక తరగతిలో ఉన్న అందరు విద్యార్ధుల పేర్లు ఎలాంటి కుల, మతాల ప్రస్తావన కానీ, రెడ్ ఇంక్ కానీ లేకుండా ఒకేలా ఉండనున్నాయి.