Breaking News

పాకిస్తాన్ లో దారుణంగా పెరుగుతున్న పసిపిల్లల కిడ్నాప్, మర్డర్ లు

 

పాకిస్తాన్ లో దారుణంగా పెరుగుతున్న పసిపిల్లల కిడ్నాప్, మర్డర్ లపై అక్కడి నెటిజన్లు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం 1,489 మంది పసి పిల్లలను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. తాజాగా రెండున్నర సంవత్సరాల వయసున్న జైనాబ్ అనే ఆడపిల్లను ఎవరో దుండగులు ఎత్తుకెళ్లి శారీరకంగా హింసించి చంపేశారు.  పెషావర్ లోని దుయాద్జీ ప్రాంతంలోని చర్సద్దా జిల్లాలో జైనాబ్ మృతదేహం కనిపించడంతో ఒక్క సారిగా పాకిస్తాన్ లో నిరసనలు చెలరేగాయి. రెండున్నర సంవత్సరాల జైనాబ్ ను శారీరకంగా హింసించి చంపినట్లు వెల్లడికావడంతో పాకిస్తాన్ లో పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తతున్నాయి. ఇంత దారుణమైన లైంగిక దాడికి పాల్పడిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని పాకిస్తాన్ పౌరులు డిమాండ్ చేస్తున్నారు. లైంగిక హింసకు పాల్పడిన వారు ఎవరో తెలుసుకోవడానికి బాలిక మృతదేహ భాగాలను డిఎన్ఏ పరీక్షకు పంపారు.  డిఎన్ఏ రిపోర్టు వచ్చిన తర్వాత సత్వర చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ప్రాంగ్ పోలీసులు ఎనిమిది మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా ముఖ్యమంత్రి మహ్మద్ ఖాన్ పోలీసు ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. తక్షణమే నేరస్తులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.