Breaking News

ఎగువ ప్రాంతంలో జోరుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు



ఎగువ ప్రాంతంలో జోరుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు మూడు క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదికి మళ్లీ వరద పెరుగుతోంది.  ప్రస్తుతం జలాశయానికి 68,901 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగుల మేర చేరింది. ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు.. ప్రస్తుతం 214.8540 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. దీంతో అధికారులు దిగువకు 1,10,874 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో కొనసాగుతున్న కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది.