Breaking News

ఆ శాస్త్రవేత్తను అమెరికా బహిష్కరించింది..


 షాంఘైలో "పీపుల్స్ సైంటిస్ట్" గా పిలిచే చెన్ చూసెన్ అనే ఒకే వ్యక్తికి అంకితం చేసిన 70,000 కళాఖండాలతో కూడిన మ్యూజియం ఉంది.

చెన్‌ని చైనా క్షిపణి, అంతరిక్ష పితామహునిగా పిలుస్తారు. చైనా తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు కావల్సిన రాకెట్లను, చైనా అణ్వాయుధాగారంలో భాగమైన క్షిపణులను అభివృద్ధి చేయడానికి చెన్ చేసిన పరిశోధనలు ఉపయోగపడ్డాయి.

ఆయనను చైనాలో జాతీయ హీరోగా కొనియాడారు.

కానీ ఆయన ఒక దశాబ్ధం పాటు చదువుకుని, పని చేసిన మరో దేశంలో ఆయన సేవలను ఎవరూ కనీసం గుర్తు కూడా చేసుకోరు. చెన్ 1911లో జన్మించారు. చైనా చివరి సామ్రాజ్య రాజ వంశం అంతమై రిపబ్లిక్‌గా అవతరిస్తున్న తరుణమది. ఆయన తల్లిదండ్రులిద్దరూ విద్యాధికులు. ఆయన తండ్రి జపాన్‌లో ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత చైనా జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు.

చెన్ చిన్న వయసు నుంచే ప్రతిభ కలిగి ఉండేవారు. ఆయన షాంఘై జియావ్ టోంగ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఆయనకు అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకునేందుకు గాను ఎవరికీ తేలికగా లభించని అరుదైన స్కాలర్ షిప్ లభించింది.

ఆయన 1935లో బోస్టన్ చేరారు. ఆ సమయంలో చెన్ జాత్యహంకారానికి, విదేశీయుల పట్ల ఆ దేశ ప్రజలు ప్రదర్శించే భయాన్ని ఎదుర్కొనే ఉండి ఉండవచ్చు అని నార్త్ జార్జియా యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ క్రిస్ జెస్పెర్సన్ చెప్పారు. కానీ, చైనా సైద్ధాంతికంగా మారుతుందనే ఆశ కూడా ఉండి ఉండవచ్చని ఆయన అన్నారు.

చెన్ అక్కడ నుంచి అప్పట్లో బాగా పేరు పొందిన ఏరోనాటికల్ ఇంజనీర్ థియోడోర్ వోన్ కర్మాన్ దగ్గర విద్యనభ్యసించడానికి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాల్టెక్) కు వెళ్లారు. అక్కడ చెన్‌కి మరో ప్రముఖ శాస్త్రవేత్త ఫ్రాంక్ మలీనాతో కలిసి పని చేసే అవకాశం కలిగింది. ఆయన సూసైడ్ స్క్వాడ్ గా పిలిచే ఒక చిన్న ఆవిష్కర్తల బృందంలో కీలకమైన సభ్యులుగా ఉండేవారు.

వాళ్ళు చదువుకునే క్యాంపస్‌లో ఒక రాకెట్ తయారు చేయడానికి ప్రయత్నించడం వలన ఆ బృందానికి ఆ పేరు వచ్చింది. "కొన్ని రకాల ప్రాణాంతకమైన రసాయనాలతో వారు చేసిన ప్రయోగాలు వారికి ఈ పేరును తెచ్చి పెట్టాయి" అని ఎస్కేప్ ఫ్రమ్ ఎర్త్: ఏ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది స్పేస్ రాకెట్ రచయత ఫ్రేజర్ మెక్‌ డోనల్డ్‌ చెప్పారు. అయితే, ఈ ప్రయోగాలలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు అని ఆయన చెప్పారు.

ఆయన ఒక రోజు మలీనా సభ్యుల బృందంతో ఒక సంక్లిష్టమైన గణిత సమస్య గురించి చర్చలో పాల్గొనే నాటికే రాకెట్ ప్రొపల్షన్ గురించి ప్రాధమిక పరిశోధన జరుపుతున్నారు.

ఆ సమయంలో రాకెట్ సైన్స్ అంటే కొంత మంది పిచ్చి వాళ్ళు, ఊహా లోకంలో విహరించే వాళ్ళు చేసే పనిగా భావించేవారని మెక్‌ డోనల్డ్‌ చెప్పారు. "వాళ్ళని ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇందులో భవిష్యత్తు ఉందని చెప్పి వారి ప్రతిష్టను దిగజార్చుకోవడానికి ఏ ఇంజనీరు సమ్మతంగా ఉండే వారు కాదు. కానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తీరుతో ఆ అభిప్రాయం మారిపోయింది" అని ఆయన అన్నారు.

ఈ సూసైడ్ స్క్వాడ్ బృందం అమెరికా మిలటరీ దృష్టిని ఆకర్షించింది. వారు విమానాల రెక్కలకు బూస్టర్లను జత చేసి చిన్న చిన్న రన్ వే ల మీద నుంచి జెట్ సహాయంతో ఎగరడానికి కావల్సిన పరిశోధన చేయడానికి నిధులు సమకూర్చారు. దీంతో కర్మన్ నాయకత్వంలో 1943లో జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ (జె పి ఎల్) ని ఏర్పాటు చేశారు. ఇందులో చెన్, ఫ్రాంక్ మలీనా ముఖ్య సభ్యులుగా ఉన్నారు.

చెన్ చైనా పౌరుడైనప్పటికీ అప్పటికి చైనా అమెరికాకి అనుబంధ దేశంగా ఉండటంతో అమెరికా అంతరిక్ష కార్యక్రమంలో ఆయన సభ్యుడిగా ఉండటం పట్ల పెద్దగా అనుమానాలు వ్యక్తం కాలేదు" అని మెక్ డోనల్డ్ చెప్పారు. ప్రత్యేకంగా వర్గీకరించిన కొన్ని ఆయుధాల పరిశోధన కోసం పని చేయడానికి చెన్ కి అవసరమయిన భద్రతాపరమైన అనుమతులు లభించాయి. ఆయన అమెరికా ప్రభుత్వ సైన్స్ అడ్వైజరీ బోర్డులో కూడా పని చేశారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ఆయన జెట్ ప్రొపల్షన్ లో ప్రపంచంలోనే ఒక ప్రముఖ నిపుణుడిగా నిలిచారు. ఆయనను థియోడోర్ వోన్ కర్మన్ తో కలిసి ఒక ప్రత్యేక ప్రాజెక్టులో పని చేయడానికి జర్మనీ పంపించారు. ఆయనకు లెఫ్టినెంట్ కలొనెల్ పదవిని ఇచ్చారు. వారు ఈ ప్రాజెక్టులో భాగంగా నాజి ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను ఇంటర్వ్యూ చేయవలసి ఉంది. జర్మనీ దగ్గర దాగిన పరిజ్ఞానాన్ని అమెరికా తెలుసుకోవాలని అనుకుంది.

కానీ, ఆ దశాబ్దం చివరకు వచ్చేసరికి చెన్ ఉద్యోగ భవిష్యత్తు అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఆయన జీవితం మరోలా మలుపు తిరగడం ప్రారంభించింది.

"చైనాలో 1949లో కమ్యూనిస్ట్ ప్యూపిల్స్ రిపబ్లిక్ ని స్థాపిస్తున్నట్లు మావో ప్రకటించారు. దాంతో చైనా దేశస్థులందరినీ అమెరికాలో దుష్టులుగా చూడటం మొదలయింది" అని క్రిస్ జెస్పెర్సన్ చెప్పారు. అమెరికా మొదట్లో చైనా పట్ల ఆకర్షితమవ్వడం, అక్కడ ఏదైనా పరిణామం చోటు చేసుకోగానే ఆ దేశాన్ని దూషించడం లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తుతూనే ఉన్నాయి అని ఆయన అన్నారు.

అంతలో జె పి ఎల్ కి కొత్తగా వచ్చిన డైరెక్టర్ పరిశోధనశాలలో గూఢచర్యం జరుగుతుందనే అనుమానాన్ని ఎఫ్ బి ఐ కి వ్యక్తం చేశారు. గూఢచర్యం చేసేవారిలో చైనా దేశస్థులు కానీ, యూదులు కానీ అయి ఉంటారని ఆయన చెప్పినట్లు ఫ్రేజర్ మెక్ డోనల్డ్ చెప్పారు.

అప్పటికే ఇరు దేశాల మధ్య అంతర్యుద్ధం మొదలయ్యే దశ కనిపిస్తోంది. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మెక్ కార్తీ చేపట్టిన కార్యకలాపాలు కూడా అదే సమయంలో చోటు చేసుకోవడం ప్రారంభమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో చెన్, ఫ్రాంక్ మలీనా లాంటి వారు కమ్యూనిస్టులు కావడంతో వారి వలన దేశ భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందంటూ ఎఫ్ బి ఐ ఆరోపణలు చేసింది.

పసడేనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన ఒక సమావేశానికి చెన్ హాజరైనట్లు అమెరికా కమ్యూనిస్ట్ పార్టీ 1938లో విడుదల చేసిన పత్రాన్నిఆధారం చేసుకుని ఎఫ్ బి ఐ ఈ ఆరోపణలు చేసింది. కానీ, చెన్ కి ఆ పార్టీతో సంబంధం లేదని తెలిపారు. కానీ, అదే సమయంలో ఆయన ఆ పార్టీలో చేరినట్లు కొన్ని కొత్తగా చేసిన పరిశోధనలు చెబుతున్నాయి.