Breaking News

కరోనా వైరస్‌లో ఎలాంటి మార్పు మ్యుటేషన్ లేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి

 


భారత్‌లో ప్రస్తుతానికి కరోనా వైరస్‌లో ఎలాంటి మార్పు (మ్యుటేషన్) లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఇంతవరకూ కరోనా మార్పు జరిగినట్టు ఎలాటి ఆనవాళ్లూ లేవని చెప్పారు. 'నేను ఈ మేరకు మీకు హామీ ఇవ్వగలుగుతున్నాను' అని ఆదివారంనాడు జరిగిన 'సండే సంవాద్' కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు కూడా లేవని మరో ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ వార్తాపత్రికలు చదవడం పూర్తిగా సురక్షితమన్నారు. కోవిడ్-19 వాక్సిన్‌కు సంబంధించి ఇండియాలో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, సీరం ఇండియా, భారత్ భయోటెక్‌లు క్లినికల్ ట్రయిల్స్ జరుపుతున్నాయని తెలిపారు. ఫేజ్-3 క్లినికల్ ట్రయిల్స్‌లో వేలాది మంది పార్టిసిపెంట్లు, ఒక్కోసారి 30,000 నుంచి 40,000 మంది పాల్గొంటున్నట్టు చెప్పారు.