Breaking News

రెండో డిబేట్ కోసం ట్రంప్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు



ఈ నెల 15న మియామిలో జరిగే రెండో డిబేట్ కోసం ఎదురుచుస్తున్నానంటూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేసిన ట్రంప్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్.. జో బిడెన్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తుందంటూ ఆరోపించారు. రెండో డిబేట్ నిర్వహించేందుకు కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్.. ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 29న తొలి ముఖాముఖిలో పాల్గొన్న తర్వాత ట్రంప్ కరోనా బారినపడ్డారు. వైద్యుల సూచనల మేరకు సైనిక ఆసుపత్రిలో చేరి, చికిత్స పొందిన ట్రంప్.. సోమవారం సాయంత్రం వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్.. ‘రెండో డిబేట్‌లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.   దీంతో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ స్పందించారు. ‘కరోనా చాలా తీవ్ర సమస్య. క్లీవ్‌లాండ్‌ క్లినిక్‌ మార్గదర్శకాలకు అనుగుణంగానే నేను నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చకై నేను ఎదురుచూస్తున్నా. కానీ ఆయనకు కొవిడ్‌ ఇంకా ఉన్నట్లైతే.. చర్చ జరగకపోవడమే మంచిది’ అని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్.. ఓ ప్రకటన చేసింది. ఈ నెల 15న మియామిలో జరగబోయే రెండో డిబేట్‌ను వర్చువల్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో స్పందించిన ట్రంప్.. కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ముఖాముని వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తే.. డిబేట్‌లో పాల్గొనను. నా సమయాన్ని వృథా చేసుకోను’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కమిషన్.. తన ప్రత్యర్థిని రక్షించడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. డెమొక్రటిక్ నేతలు మాత్రం.. కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ చేసిన ప్రకటనను స్వాగతించారు.