Breaking News

కొత్త భూచట్టాలపై పీడీపీ ఆందోళన


 జమ్ముకాశ్మీర్‌ను కార్పొరేట్‌ పరం చేసేందుకు మోడీ సర్కార్‌ చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన వారిపై అధికారులు నిర్బంధం ప్రదర్శించారు. ఆందోళనకు దిగిన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ)కి చెందిన నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఆందోళనకారులు బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన శ్రీనగర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయానికి కూడా అధికారులు తాళం వేశారు. శ్రీనగర్‌లో ఆ పార్టీ ప్రతినిధి బుఖారీ, రౌఫ్‌ భట్‌, వహీద్‌ పర్రా, మోహిత్‌ భన్‌ సహా కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

కొత్త భూచట్టాలతోపాటు, ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జీఓలు)పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులపై కూడా వీరు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద నిరసన తెలుపుతున్న పీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టైన వారికి కలిసేందుకు వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను మధ్యలోనే ఆపేసి వెనక్కు వెళ్లాలని కోరారు.
తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఫ్తీ మాట్లాడారు. అధికారుల వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. జమ్ముకాశ్మీరు భూమిని దోచుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన భూ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న పీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. అరెస్టు అయిన కార్యకర్తలను కలిసేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. ప్రజలు, రాజకీయ నేతలు మాట్లాడటానికి వీల్లేకుండా పోయిందని కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్తు జమ్ముకాశ్మీరును జైలుగా మార్చేశారని పేర్కొన్నారు. జమ్ముకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులకు సంబంధించి ప్రపంచానికి మీరు చెబుతున్న నిర్వచనం ఇదేనా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ విధానాలపై తమ గొంతుకను వినిపిస్తూనే ఉంటామన్నారు.
జమ్ముకాశ్మీర్‌తో పాటు లడఖ్‌లలో ఎవరైనా భూములను కొనవచ్చని నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త చట్టాలను నోటిఫై చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మోడీ సర్కార్‌ జమ్ముకాశ్మీర్‌ను అమ్మకానికి పెట్టిందని నేతలు విమర్శిస్తున్నారు. గతేడాది ఆగస్టు 5న జమ్ముకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్రం మాజీ ముఖ్యమంత్రులైన ఫరూక్‌ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు అనేక మంది ఇతర పార్టీలకు చెందిన నేతలను కొన్ని నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు.