Breaking News

ఐటీ రంగంలో చిగురిస్తున్న ఆశలు.. ఉద్యోగులకు శుభవార్త..



కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఈ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడింది. అనేక కంపెనీలు మూతబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయా కంపెనీల ఉద్యోగులు రోడ్డునపడ్డారు. తప్పని పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించుకోవడం కోసం మరి కొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. కొన్ని సంస్థలు సిబ్బంది వేతనాల్లో కోతలు విధించాయి. ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లోనూ సాఫ్ట్ వేర్ దిగ్గజం టీసీఎస్ మాత్రం తమ కంపెనీ ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు ప్రకటించింది.


సంస్థలోని అన్ని బ్యాండ్ల ఉద్యోగులకు ఈ పెంపు వర్తిస్తుందని సంస్థ మానవ వనరుల విభాగం హెడ్ మిలింద్‌ లాకడ్‌ స్పష్టం చేశారు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో అసాధారణ స్థాయిలో పనిచేసిన సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి వేతనాల పెంపు వర్తిస్తుందని స్పష్టం చేశారు. కంపెనీ గడిచిన మూడు నెలల్లో కొత్తగా 9,784 మందిని నియమించుకుంది. ఇందులో ఇండియాకు చెందిన వారు 7, 200 మంది ఉన్నారు.


అమెరికాకు చెందిన వారు మరో 1000 మంది ఉన్నారు. ఉద్యోగుల వలసలు ఈ సారి ఆల్ టైమ్ కనిష్టంగా 8.9% ఉందని టీసీఎస్ ప్రకటించింది. కరోనా కారణంగా కంపెనీ 34 మంది ఉద్యోగులను కోల్పోయిందని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ సమయం సవాళ్లు, కష్టాలతో కూడుకున్నదన్నారు.త్వరలో ఉద్యోగ నియామకాలను కూడా ప్రారంభించనున్నట్లు టీసీఎస్ ప్రకటించింది.


సెప్టెంబర్ 30 నాటికి తమ కంపెనీలో 453,540 మంది ఉద్యోగులు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. టీఎస్ఎస్ నిర్ణయం సాఫ్ట్ వేర్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో సరికొత్త జోష్ నింపింది. దీంతో కరోనా కారణంగా వేతనాల పెంపు ఆగడంతో ఇబ్బంది పడుతున్న అనేక ఐటీ ఉద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే టీసీఎస్ వేతనాల పెంపు ప్రకటన తర్వాత.. మిగతా ఐటీ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్న అంశం ఆసక్తికరంగా మారింది.