Breaking News

ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న అకృత్యాలపై నిరసనలు



ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై పెరుగుతున్న అకృత్యాలపై నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవీ నవరాత్రుల సందర్భంగా మహిళల 'భద్రత, గౌరవం, స్వావలంభన'పై దృష్టి పెట్టేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ''శనివారం అన్ని జిల్లాలకు చెందిన ఇంచార్జ్ మంత్రులు ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు...'' అని ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది. దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే తొలిరోజైన అక్టోబర్ 17 నుంచి చివరి రోజైన 25 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలను సమన్వయంతో మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్టోబర్ వరకు జరిగే తొలి దశ కార్యక్రమం ముగిసిన తర్వాత.. ''మిషన్ శక్తి'' పేరుతో దీన్ని కొనసాగిస్తామన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే వసంత నవరాత్రితో ''మిషన్ శక్తి'' ముగుస్తుందని ఆయన వెల్లడించారు.