Breaking News

టపాసులు కాల్చే వారికి షాకింగ్ న్యూస్..


 మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రానుంది. సాధారణంగా దీపావళి పండుగ అంటే ఉండే సందడి అంతాఇంతా కాదు. అయితే ఈ సంవత్సరం మాత్రం కరోనా వైరస్ విజృంభణ, కాలుష్యం నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దీపావళి అమ్మేవాళ్లకు, కాల్చేవాళ్లకు షాకింగ్ న్యూస్ చెప్పారు.

ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజున టపాసుల్లోని రసాయనాల వల్ల కాలుష్యం రికార్డుస్థాయిలో నమోదవుతోంది. సాధారణంగా ఇతర కాలాలతో పోల్చి చూస్తే చలికాలంలో ఢిల్లీలో రికార్డు స్థాయిలో కాలుష్యం వెదజల్లుతుంటుంది. వాహనాల వల్ల 60 శాతం, పొలాల నుంచి 20 శాతం కాలుష్యం వెలువడుతున్నట్టు ఒక అంచనా. దీంతో రేపటి నుంచి డిసెంబర్ నెల 30 వరకు ఢిల్లీలో బాణసంచా కాల్చటంపై నిషేధం కొనసాగుతోంది.

పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ దీపావళి టపాసులు అమ్మితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని తెలిపారు. గ్రీన్ కాకర్స్ తో పాటు టపాసులు అమ్మడం, వాడటంపై పూర్తి నిషేధం అమలవుతోంది. ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా బాణసంచాపై నిషేధం అమలవుతోంది. ఇతర రాష్ట్రాలు సైతం బాణసంచాపై నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.

పర్యావరణ వేత్తలు సైతం దీపావళి పండుగ రోజున వాయు, శబ్ద కాలుష్యం తీవ్రమవుతోందని.. ప్రజలు అనవసరంగా కోట్ల రూపాయలు బాణసంచా కోసం ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. నైట్రేట్, జింక్, కాపర్, కాడ్మియం, సీసం, సల్ఫర్, మెగ్నీషియం బాణసంచా తయారు చేయడంలో వినియోగిస్తారు. వీటి వల్ల చర్మ సంబంధిత వ్యాధులతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తున్నాయి.