Breaking News

దుబ్బాక ఉపఎన్నికకు సర్వం సిద్దం


 తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న దుబ్బాక ఉపఎన్నికకు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఈనెల 10న చేపట్టనున్నారు. ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహా 23 మంది అభ్యర్థులు ఉన్నారు.

దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న 1,98,807 మంది ఓటర్లకు గాను 315 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 104 కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ జరపనున్నారు. అలాగే 89 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించగా.. వాటిలో 33 అతి సమస్యాత్మక ప్రాంతాలు. ఈ కేంద్రాల్లో అదనపు పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు పది జిల్లాల నుంచి పోలీసులను రప్పించారు. నియోజకవర్గంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు, సీసీ కెమెరా, వీడియో గ్రాఫర్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల దగ్గర వృద్దులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో దాదాపు 6 వేల మంది దివ్యాంగులు, వృద్ద ఓటర్లు ఉన్నారు. 630 మంది అంధులు ఓటు హక్కు వినియోగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి కోసం బ్రెయిలీ లిపిలో డమ్మీ బ్యాలెట్‌ పత్రాలు అందుబాటులో ఉంచుతారు.