Breaking News

మరీ అంత తక్కువ స్కోరా..!


 మహిళల టీ20 చాలెంజ్ లో వెలాసిటీ, ట్రెయిల్ బ్లేజర్స్ మధ్య మ్యాచ్ అత్యల్ప స్కోరుతో ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ 15.1 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. స్వల్ప లక్ష్యాన్ని ట్రెయిల్ బ్లేజర్స్ 7.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.

ప్రపంచ నంబర్‌వన్‌ బౌలరైన సోఫీ ఎకిల్‌స్టోన్‌ (4/9), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/13), జులన్‌ గోస్వామి (2/13) సమష్టిగా వెలాసిటీని దెబ్బతీశారు. ఒక సిక్సర్‌, బౌండరీ బాది జోరుమీదున్న ఓపెనర్‌ షెపాలీ వర్మ (13)ను 2.2వ బంతికే జులన్‌ బౌల్డ్‌ చేసింది. ఎకిల్‌స్టోన్‌ స్కోరు 19 వద్ద వరుసగా మిథాలీ రాజ్‌ (1), వేద కృష్ణమూర్తి (0)ను పెవిలియన్‌ పంపించింది.

డేనియెల్‌ వ్యాట్‌ (3)ను జులన్‌ ఔట్‌ చేయడంతో వెలాసిటీకి మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి. సుష్మ వర్మ (1), సున్‌ లుస్‌ (4) కూడా ఈ మ్యాచ్ లో చేతులు ఎత్తేశారు. సుష్మను ఎకిల్‌స్టోన్‌, లూస్‌ను రాజేశ్వరీ ఔట్ చేశారు. శిఖా పాండే (10), కాస్పెరెక్‌ (11) ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమయ్యారు. దివ్యదర్శిని (0), ఎక్తాబిష్ఠ్‌ (0), జహనారా ఆలమ్‌ (1)లు కూడా వెనుదిరగడంతో.. టోర్నమెంట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదైంది.

ఈ లక్ష్యాన్ని ట్రెయిల్ బ్లేజర్స్ 7.5 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది. బ్లేజర్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ డయాండ్రా డాటిన్ 29 పరుగులతో అజేయంగా నిలిచింది. రిచా ఘోష్ 13 పరుగులు సాధించింది. కెప్టెన్ స్మృతి మంథన 6 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగినా, ఏమాత్రం తడబాటు లేకుండా డాటిన్, ఘోష్ మిగిలిన పని పూర్తి చేశారు. శుక్రవారం జరిగే మ్యాచ్ లో ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవాస్ తో తలపడనుంది.