Breaking News

'సర్జికల్ స్ట్రయిక్స్' అంటే ఏమిటి?


 నాలుగు సంవత్సరాల క్రితం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ జరిపి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి భారతీయుడు దేశ సైన్యాన్ని చూసి గర్వించాడు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ అంశం చర్చసహనీయంశంగా మారింది. పాత బస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహిస్తామంటూ బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సర్జికల్ స్ట్రయిక్స్ అంటే ఏమిటి? సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? అనే విషయాలు తెలుసుకుందాం..

సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించడానికి సైన్యం ప్రత్యేకంగా శిక్షణ పొందుతుంది. అందుకోసం మెరికల్లాంటి జవాన్లను ఎంచుకుంటారు. భారత త్రివిధ దళాల్లో వీటి కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తాయి. సాధారణంగా జవాన్లను రక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. కానీ సర్జికల్ స్ట్రయిక్స్ కోసం ఎంచుకునే స్పెషల్ ఫోర్సెస్ ను ప్రత్యేకించి దాడుల కోసం ఉపయోగిస్తారు. వీరు ఇండియన్ ఆర్మీలో అందరికంటే ఫిట్ గా, బలంగా, మానసికంగా అప్రమత్తతతో ఉండే సైనికులు.ఇలాంటి స్ట్రయిక్స్ నిర్వహించినప్పుడు 99 శాతం వారు చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రాణత్యాగం చేయడానికి కూడా వారు మానసికంగా సిద్ధంగా ఉంటారు. సర్జికల్ స్ట్రయిక్స్ అంటే నిర్దేశిత దాడులు.

దాడి చేయవలసిన లక్ష్యాన్ని పక్కా ప్రణాళికతో నిర్దేశించుకుంటారు. ఎక్కువ విధ్వంసం జరగకుండా అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తారు. గ్రామాలు, పట్టణాలు, జనావాసాలు అధికంగా ఉన్న స్థావరాల్లో దాడులు చేయవలసి వచ్చినప్పుడు సర్జికల్ స్ట్రయిక్స్ ను నిర్వహిస్తుంటారు. వీటి వలన సాధారణ పౌరులకు నష్టం కలిగించకుండా పని చక్కబెట్టేస్తారు. ఉగ్ర స్థావరాలను గుర్తించి 100 శాతం వాటిపైనే దాడులు చేసే విధంగా ప్రణాళిక రచిస్తారు. సర్జికల్ స్ట్రయిక్స్ జరపాలంటే వీటిలో ఇంటెలిజెన్స్ విభాగాల పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ దాడులు నిర్వహించే సమయంలో సైన్యాన్ని చేరవేయడానికి వాయు మార్గాన్ని ఉపయోగిస్తారు. అంటే హెలికాఫ్టర్ల సహాయంతో వెళ్లి ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహిస్తారు.

శత్రువు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే విధ్వంసం సృష్టించగలరు వీరు. స్పెషల్ ఫోర్సెస్ లో ఉండే సైనికుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది. చావోరేవో తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు వీరి మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాలలో ఎయిర్ స్ట్రయిక్స్ కూడా నిర్వహిస్తారు. వీటినే వైమానిక దాడులుగా పిలుస్తారు. చాలా తక్కువ సమయంలో నిర్దేశించిన ప్రాంతంపై దాడి చేసి వస్తారు. అయితే ఈ తరహా స్ట్రయిక్స్ లో ఇంటెలిజెన్స్ విభాగాలు, రా ఏజెంట్లు, ఇంటెలిజెన్స్ బ్యూరో, లోకల్ పోలీసులకు చెందిన సిఐడి వర్గాలు, సాధారణ ప్రజల్లో నియమించే ఏజెంట్లు ఇచ్చే సమాచారం ఆధారంగా దాడులు నిర్వహిస్తారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ తర్వాత 2017లో కూడా భారత్ మయన్మార్ పై సర్జికల్ స్ట్రయిక్స్ ను నిర్వహించింది. ఈశాన్య రాష్ట్రాలకు వేర్పాటువాదులు మయన్మార్‌ను అడ్డాగా మార్చుకొని భారత్‌కు వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని నిఘా వర్గాలు ద్వారా సమాచారం అందింది. గతంలో భారత్, మయన్మార్ సైన్యాలు కలిసి వేర్పాటు వాదులను తుదముట్టించాయి. మరోసారి మణిపూర్‌లో సైనికులపై తిరుగుబాటుదారులు దాడి చేసి 18 మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంతో భారత సైన్యం భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాదులను ఏరివేసింది. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ ను కేవలం 40 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసారు. ఈ తరహా దాడులు జరపవలసి వచ్చినప్పుడు వీటిని అత్యంత రహస్యంగా ఉంచుతారు. శత్రువులకు ఎలాంటి అనుమానం కలగకుండా చూసుకుంటారు. భారత ప్రభుత్వం ఆదేశాలతో కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో సైన్యం పనిచేస్తుంది.