Breaking News

పలు డిగ్రీ కాలేజీలపై ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొరడా


 పలు డిగ్రీ కాలేజీలపై ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని దాదాపు 48 ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతులను రద్దు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ మంగళవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గతంలో వివిధ కారణాలతో 246 ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. అవి యూనివర్సిటీల అఫ్లియేషన్‌ లేకుండానే నిర్వహిస్తుండడం, ప్రవేశాలు లేకుండానే కొనసాగుతుండడం.. ప్రవేశాలు చేపట్టినా చేరికలు 25% కన్నా తక్కువగా ఉండడం తదితర కారణాలతో 246 ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. ఇందు కోసం మండలి ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది.

కమిటీ ముందుకు ఆయా కళాశాలలు వారికి అందిన షోకాజ్ నోటీసులకు వివరణ, సంబంధిత డాక్యుమెంట్లతో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే కొన్ని కాలేజీలు కమిటీ ముందు హాజరై సరైన సమాధానాన్ని తెలియజేశాయి. అయితే మరికొన్ని కళాశాలలు మాత్రం విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక ఆధారంగా 48 ప్రైవేటు డిగ్రీ కాలేజీల అనుమతులను పూర్తిగా రద్దు చేశారు. దీంతో పాటు మరో 61 డిగ్రీ కాలేజీల్లోని కొన్ని ప్రోగ్రామ్‌లను ఉన్నత విద్యామండలి ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది.