Breaking News

గౌతమ్ గంభీర్ నివాసంలో ఒకరికి కరోనా


 దేశంలో కరోనా ఉధృతి ఓ వైపు కొనసాగుతూ ఉంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ నివాసంలో ఒకరికి కరోనా సోకింది. దీంతో గంభీర్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్ళాడు. నివాసంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా టెస్టులకు గంభీర్ తన నమూనాలను పంపించాడు. అయితే ఫలితం కోసం ఎదురుచూస్తున్నాడు. తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించిన గంభీర్.. తన కోసం, తన కుటుంబం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులను కోరాడు. ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని అన్నాడు. దీనిని తేలిగ్గా తీసుకోవద్దని ట్వీట్ ద్వారా తెలిపాడు.

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,638 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 84.11 లక్షలకు చేరుకుంది. 1,24,985 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. ఢిల్లీలో నిన్న 6 వేల కేసులు నమోదయ్యాయి. గంభీర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్నాడు.

దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గాయని భావిస్తూ ఉన్నారు. మరో వైపు మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు మాత్రం సెకండ్ వేవ్ ను చూస్తూ ఉన్నాయి. ఇకనైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు. అజాగ్రత్తగా ఉంటే మాత్రం దారుణమైన పరిస్థితులు ఎదుర్కోక తప్పదని చెబుతూ ఉన్నారు.