Breaking News

ట్రయల్‌బ్లేజర్స్‌పై ఉత్కంఠ గెలుపు


 డిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌నోవాస్‌ నిలిచింది. ఉత్కంఠ ఛేదనలో 146 పరుగుల స్కోరును కాపాడుకుంది. శనివారం షార్జాలో ట్రయల్‌బ్లేజర్స్‌పై 2 పరుగుల తేడాతో గెలుపొందిన సూపర్‌నోవాస్‌.. ముచ్చటగా మూడోసారి మహిళల టీ20 చాలెంజ్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 147 పరుగుల ఛేదనలో దీప్తి శర్మ (43 నాటౌట్‌, 40 బంతుల్లో 5 ఫోర్లు) వృథా అయ్యింది. ఓపెనర్లు డాటిన్‌ (27, 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతీ మంధాన (33, 40 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) శుభారంభం అందించారు. కానీ రిచా ఘోష్‌ (4), హేమలత (4) విఫలమయ్యారు.

ఆఖర్లో హర్మన్‌డియోల్‌ (27, 15 బంతుల్లో 3 ఫోర్లు) తోడుగా దీప్తి శర్మ సూపర్‌నోవాస్‌కు షాకిచ్చినంత పని చేసింది. ఆఖరు 12 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన స్థితిలో ట్రయల్‌బ్లేజర్స్‌ 21 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత ఓవర్లలో ట్రయల్‌బ్లేజర్స్‌ 144/5 పరుగులకే పరిమితం అయ్యింది. మూడు జట్లు ఒక్కో మ్యాచ్‌లో గెలుపొందినా..

నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా సూపర్‌నోవాస్‌, ట్రయల్‌బ్లేజర్స్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. వెలాసిటీ లీగ్‌ దశ నుంచే నిష్క్రమించింది. అంతకముందు, మహిళల టీ20 చాలెంజ్‌ ఫైనల్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సూపర్‌ నోవాస్‌ మెరిసింది. ట్రయల్‌బ్లేజర్స్‌పై భారీ స్కోరు సాధించింది.

చమరి ఆటపట్టు జయంగణి (67, 48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో విరుచుకుపడింది. ఓపెనర్‌ ప్రియా పూనియా (30, 37 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (31, 29 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రాణించారు. జయంగణి, హర్మన్‌ప్రీత్‌, ప్రియా పూనియా మెరుపులతో లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో సూపర్‌నోవాస్‌ 146/6 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్‌ నెగ్గిన సూపర్‌నోవాస్‌ ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఓపెనర్లు జయంగణి (67), ప్రియా పూనియా (30)లు తొలి వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 12 ఓవర్లు ఆడిన ఈ జోడీ ట్రయల్‌బ్లేజర్స్‌ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంది. చమరి ఆటపట్టు ఐదు ఫోర్లు సహా నాలుగు భారీ సిక్సర్లతో సీజన్‌లో తొలి అర్థ సెంచరీ నమోదు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సైతం ఓ సిక్సర్‌, ఓ ఫోర్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. జెమీమా రొడ్రిగస్‌ (1), శిశికళ సిరివర్ధనె (2), అనుజా పాటిల్‌ (1)లు స్వల్ప స్కోర్లే చేశారు. ట్రయల్‌బ్లేజర్స్‌ బౌలర్లలో జులన్‌ గోస్వామి, సల్మా ఖతున్‌, హర్మన్‌ డియోల్‌లు తలా ఓ వికెట్‌ పడగొట్టారు.