Breaking News

అసోం-మిజోరం సరిహద్దుల్లో కేంద్ర భద్రతాదళాల మోహరింపు


 అసోం-మిజోరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కేంద్ర భద్రతాదళాలను మోహరించామని అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్టు బారువా చెప్పారు. అసోం- మిజోరం 164 కిలోమీటర్ల సరిహద్దుల్లోని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలతో ఉద్రిక్తంగా మారింది. రెండు రాష్ట్రాల ఘర్షణల మధ్య ప్రజలు గాయపడ్డారు. మిజోరం భద్రతా సిబ్బంది తమ రాష్ట్ర భాగాలను ఆక్రమించుకున్నారని అసోం ఆరోపిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో కేంద్ర భద్రతాదళాల రాకతో రెండు వైపులా శాంతి నెలకొంటుందని అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్టు బారువా చెప్పారు.

అసోం, మిజోరాం సరిహద్దుల్లో ఇటీవల ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది.

ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. సరిహద్దు గ్రామ శివార్లలో ఆటో రిక్షా స్టాండ్ సమీపంలో ఉన్న ఓ గుంపుపై కర్రలతో, ఆయుధాలతో అసోం ప్రజలు కొందరు దాడి చేశారు. దీంతో వైరేంగ్ ప్రాంత వాసులు గుమిగూడారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించి... లైలాపూర్ వాసులు జాతీయ రహదారి వెంబడి నిర్మించిన 20 గుడిసెలు, స్టాల్స్‌కు నిప్పు పెట్టారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వెంట వున్న లైలాపూర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఇళ్లను దుండగులు దహనం చేశారు.