Breaking News

బండి సంజయ్ కామెంట్స్


 ఈసారి GHMC ఎన్నికల ప్రచారం ఓ రేంజ్‌లో సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతల మాటలు మంటలు రేపుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్... ఇప్పటికే... పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని డైలాగ్స్ పేల్చి... తీవ్ర దుమారానికి తెరతీశారు. ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గని ఆయన... వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుందనీ... ఆ తర్వాత బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా... ప్రచారం చివరి రోజైన నేడు బేగంపేటలో ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. అంబర్‌పేట, అబిడ్స్ దాకా వచ్చిన MIM రేపు ముషీరాబాద్... సికింద్రాబాద్ వరకు వచ్చే ప్రమాదం ఉందన్నారు.

పాతబస్తీలో హిందువుల జనాభా ఎందుకు తగ్గుతోంది అని ప్రశ్నించారు. శాలిబండ అలియాబాద్ ఉప్పుగూడ లాల్ దర్వాజ, గౌలిపుర, చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడ పోయారని ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. "వాళ్ళ ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారు? ఎవరు కబ్జా చేశారు?" అని ప్రశ్నించారు బండి సంజయ్.

నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనున్న ఈ ఎన్నికల ప్రచారంలో... బీజేపీ పూర్తిస్థాయి ప్రచారం చేసిందనుకోవచ్చు. ఈ ఎన్నికలు చిన్నవే అయినా... వీటిపై పూర్తి ఫోకస్ పెట్టి... పార్టీ అగ్రనేతలను రంగంలోకి దింపడం విశేషం. ప్రచార చివరి రోజున అమిత్ షా... రంగంలోకి దిగడం... భాగ్యలక్ష్మి ఆలయానికి ఆయన పర్యటన ఉండటం అన్నీ బీజేపీ ప్రచార వ్యూహంలో భాగమే అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా అయితే... ఈ ఎన్నికలు వన్ సైడ్ ఉండేవనీ... దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలవడంతో... రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పోటీ... టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉందని అంటున్నారు.

భాగ్యనగర్‌లో బీజేపీని గెలిపిస్తే... 24 గంటల్లో... పోలీస్ చర్య ద్వారా... హైదరాబాద్‌లోని రోహింగ్యాలను తరిమేస్తామని తాజాగా బండి సంజయ్ అన్నారు. మొత్తానికి బీజేపీ... ఈ రోహింగ్యాల అంశాన్ని బాగా ఫోకస్ చేసింది. దీనిపై ప్రజలు చర్చించుకునేలా చేసింది. మరి ప్రజలు ఈ మొత్తం ప్రచారంపై ఏమనుకుంటున్నారు. ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. టీఆర్ఎస్ మాత్రం బీజేపీ... మత విధ్వేషాలు రెచ్చగొడుతోందనీ... అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో తేల్చుకోండి అని ప్రజలను కోరింది. డిసెంబర్ 1న ఎన్నికలు జరగనుండగా... 4న ఫలితాలు రానున్నాయి. ఆ రోజున ప్రజా తీర్పు ఏంటన్నది స్పష్టం కానుంది.